సంక్షిప్త వార్తలు(5)

సజ్జన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 08 May 2024 03:36 IST

29% పెరిగిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లాభం
డివిడెండ్‌ 20%

దిల్లీ: సజ్జన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.272 కోట్లతో పోలిస్తే ఇది 29% అధికం. ఆదాయం రూ.2,806 కోట్ల నుంచి 3% పెరిగి రూ.2,879 కోట్లకు చేరింది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.1,478 కోట్ల నుంచి 17% పెరిగి రూ.1,723 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.10,867 కోట్ల నుంచి 10% పెరిగి రూ.11,941 కోట్లకు చేరింది.
  • రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 (20%) చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది. ప్రైవేట్‌ ఆఫరింగ్‌లు లేదా ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు పద్ధతి లేదా అర్హులైన సంస్థాగత మదుపర్లకు షేర్ల కేటాయింపు లేదా ఇతర పద్ధతులు/వీటి కలయికలో రూ.10,000 కోట్లకు మించకుండా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
  • సమీక్షా త్రైమాసికంలో నికర విద్యుదుత్పత్తి 6,397 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన 26% వృద్ధి నమోదైంది. 2023-24లో నికర ఉత్పత్తి 27% పెరిగి 27.9 బిలియన్‌ యూనిట్లకు చేరింది. పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) ఉత్పత్తి 54% పెరిగి 9.3 బి.యూనిట్లకు చేరింది.

వోల్టాస్‌ డివిడెండ్‌ 500%

దిల్లీ: ఎయిర్‌ కండీషనింగ్‌, ఇంజినీరింగ్‌ సేవల సంస్థ వోల్టాస్‌, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.110.64 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.143.23 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి 22.75% తగ్గింది. అధిక వ్యయాలు ఇందుకు కారణమయ్యాయి. కార్యకలాపాల ఆదాయం రూ.2,956.80 కోట్ల నుంచి రూ.4,202.88 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.2,761.45 కోట్ల నుంచి రూ.4,044.90 కోట్లకు పెరిగాయి. ఎయిర్‌ కండీషనర్‌ (ఏసీ) ఉత్పత్తుల విభాగ ఆదాయం రూ.2,049 కోట్ల నుంచి 44% పెరిగి రూ.2,955 కోట్లకు చేరగా.. ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, సేవల విభాగ ఆదాయం రూ.142 కోట్ల నుంచి రూ.156 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) వోల్టాస్‌ నికర లాభం రూ.136.22 కోట్ల నుంచి రూ.248.11 కోట్లకు; కార్యకలాపాల ఆదాయం రూ.9,498.77 కోట్ల నుంచి రూ.12,481.21 కోట్లకు పెరిగింది. 2023-24లో 20 లక్షల ఏసీ విక్రయాల మైలురాయిని అందుకున్నట్లు వోల్టాస్‌ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.5 (500%) డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.


ఒమెగా హెల్త్‌కేర్‌లో గోల్డ్‌మన్‌, ఎవర్‌స్టోన్‌ వాటా అమ్మకం!

రోగ్య సంరక్షణ రంగానికి సేవలందించే ఐటీ సేవల సంస్థ ఒమెగా హెల్త్‌కేర్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ఎవర్‌స్టోన్‌ క్యాపిటల్‌ తమ వాటాలు విక్రయించడం కోసం 1.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.14,000 కోట్ల) విలువను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో గోల్డ్‌మన్‌కు మెజారిటీ వాటా ఉండడంతో, మొత్తం వాటా విక్రయించకుండా 20% వాటా అట్టేపెట్టుకోవాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఎవర్‌స్టోన్‌ మాత్రం తనకున్న మొత్తం వాటాను విక్రయించనుందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వాటా విక్రయానికి సంబంధించిన చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. 2003లో ఏర్పాటైన ఒమేగా హెల్త్‌కేర్‌.. రెవెన్యూ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీసెస్‌, ఇతరత్రా సపోర్ట్‌ సేవలను ఆరోగ్య సంరక్షణ కంపెనీలకు అందజేస్తోంది.

ఇదే తొలిసారి కాదు: గోల్డ్‌మన్‌, ఎవర్‌స్టోన్‌లు ఒమేగాలో మాత్రమే పెట్టుబడులు పెట్టలేదు. 2023 జనవరిలో గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ సిప్రైమ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. 2020లో ఐటీ సేవల సంస్థ ఎవర్‌రైజ్‌ను బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు ఎవర్‌స్టోన్‌ విక్రయించింది.


యూబీఎల్‌ లాభం అయిదింతలు
తుది డివిడెండ్‌ 1000%

దిల్లీ: యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీఎల్‌) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.80.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.13.05 కోట్లతో పోలిస్తే ఇది అయిదింతలు. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4,081.01 కోట్ల నుంచి 17% పెరిగి రూ.4,788.68 కోట్లకు చేరింది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.308.10 కోట్ల నుంచి 33% పెరిగి రూ.412.59 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.16,700.52 కోట్ల నుంచి 10.49% పెరిగి రూ.18,453.27 కోట్లకు చేరింది.
  • రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.10 చొప్పున (1000%) తుది డివిడెండ్‌ను చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో 18న ప్రత్యేక ట్రేడింగ్‌

ముంబయి: ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగంలో ఈనెల 18న ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహించనున్నట్లు బీఎస్‌ఈ, న్‌ఎస్‌ఈ  వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ప్రధాన వెబ్‌సైట్‌లో (ప్రైమరీ సైట్‌) సాంకేతిక అంతరాయం లేదా వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు దానిని పరిష్కరించేందుకు ఎంతమేర సన్నద్ధతతో ఉన్నామనే అంశాన్ని పరిశీలిండమే దీని ఉద్దేశం. మే 18న 2 సెషన్స్‌లో ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ జరుగుతుంది. మొదటిది ఉదయం గం.9.15 నుంచి గం.10.00 వరకు ప్రైమరీ సైట్‌ (పీఆర్‌) నుంచి, రెండోది  గం.11.30 నుంచి గం.12.30 వరకు డిజాస్టర్‌ రికవరీ సైట్‌ (డీఆర్‌) నుంచి ఈ ట్రేడింగ్‌ను నిర్వహిస్తామని ఎక్స్ఛేంజీలు తెలిపాయి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు