3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి.

Published : 08 May 2024 03:41 IST

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు పడేశాయ్‌
సమీక్ష

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. షేర్ల విలువలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం ప్రభావం చూపింది. లోక్‌సభ ఎన్నికల మొదటి 3 దశల్లో తక్కువ పోలింగ్‌ నమోదైందని, అధికార భాజపాకు ఇది ప్రతికూలమన్న విశ్లేషకులు అంచనాలూ ఇందుకు తోడయ్యాయి. నిఫ్టీ సూచీ తన 50 రోజుల సగటు కదలికల స్థాయి దిగువకు చేరింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా, మదుపర్ల సంపద దాదాపు రూ.11 లక్షల కోట్ల మేర ఆవిరైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 83.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ మినహా మిగతావి రాణించాయి. ఐరోపా సూచీలు లాభపడ్డాయి.

సెన్సెక్స్‌ ఉదయం 73,973.30 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో 74,026.80 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసిన సూచీ, వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 73,259.26 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 383.69 పాయింట్ల నష్టంతో 73,511.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.20 పాయింట్లు కోల్పోయి 22,302.50 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,232.05- 22,499.05 పాయింట్ల మధ్య కదలాడింది.

  • మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో మారికో షేరు 9.85 శాతం దూసుకెళ్లి రూ.583.35 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.6,768.16 కోట్లు పెరిగి రూ.75,491.43 కోట్లకు చేరింది.
  • రూ.4,616 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలం కావడంతో జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ షేరు 5.77% నష్టపోయి రూ.17.64 దగ్గర ముగిసింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 డీలాపడ్డాయి. ఆర్‌ఐఎల్‌ 1.27%, హెచ్‌డీఎఫ్‌సీ 1.08%, పవర్‌గ్రిడ్‌ 3.80%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.05%, టాటా మోటార్స్‌ 2.72%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.61%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.14%, ఎన్‌టీపీసీ 2.13%, టాటా స్టీల్‌ 2.03% నష్టపోయాయి. హెచ్‌యూఎల్‌ 5.51%, టెక్‌ మహీంద్రా 2.37%, నెస్లే 2.06%, టీసీఎస్‌ 1.47%, ఐటీసీ 1.33%, కోటక్‌ బ్యాంక్‌ 1.20%, విప్రో 1.13%, ఇన్ఫోసిస్‌ 1.05% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 3.41%, యుటిలిటీస్‌ 2.85%, కమొడిటీస్‌ 2.18%, వినియోగ 1.73%, టెలికాం 1.43% నీరసపడ్డాయి. ఐటీ, టెక్‌ మెరిశాయి. బీఎస్‌ఈలో 2794 షేర్లు నష్టాల్లో ముగియగా, 1034 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 104 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • ఇండీజీన్‌ ఐపీఓ రెండో రోజుకు 7.34 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,88,66,677 షేర్లను ఆఫర్‌ చేయగా, 21,20,23,944 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
  • అదానీ గ్రీన్‌ ఎనర్జీ నుంచి 20 ఏళ్ల పాటు విద్యుత్‌ కొనుగోలు చేసే ఒప్పందానికి శ్రీలంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 484 మెగావాట్ల పవన విద్యుత్‌ స్టేషన్‌లను సంస్థ అభివృద్ధి చేయనుంది.
  • లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ అందించే ప్రీమియర్‌ రోడ్‌లైన్స్‌ ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.63-67 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.40 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి. రిటైల్‌ మదుపర్లు కనీసం 2000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
  • అరుదైన నరాల సంబంధిత వ్యాధి చికిత్సలో వినియోగించే జనరిక్‌ ఎడారవోన్‌ ఇంజెక్షన్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చిందని గ్లాండ్‌ ఫార్మా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెటింగ్‌ భాగస్వామితో కలిసి ఈ ఇంజెక్షన్‌ను అమెరికాలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.
  • ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు సెబీ అనుమతి లభించినట్లు సంస్టార్‌ లిమిటెడ్‌ తెలిపింది. మొక్కల ఆధారిత స్పెషాలిటీ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఐపీఓ పరిమాణం రూ.425- 500 కోట్లుగా ఉండొచ్చు.
  • డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ వీసా కంట్రీ మేనేజర్‌ (భారత్‌)గా సుజయ్‌ రైనా నియమితులయ్యారు.

నేటి బోర్డు సమావేశాలు: ఎల్‌ అండ్‌ టీ, టాటా పవర్‌, కెనరా బ్యాంక్‌, టీవీఎస్‌ మోటార్‌, హీరో మోటోకార్ప్‌, భారత్‌ ఫోర్జ్‌, బీఎస్‌ఈ, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, విజయ డయాగ్నోస్టిక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు