విదేశాలకు రూ.7 లక్షలకు మించి పంపితే 20% టీసీఎస్‌

విదేశీ పర్యటనల ప్యాకేజీ, లిబరలైజ్డ్‌ రెమిటెన్సిస్‌ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద విదేశాలకు భారతీయులు పంపే నిధుల విలువ రూ.7 లక్షలు మించితే అక్టోబరు 1 నుంచి మూలం వద్ద 20 శాతం పన్నును వసూలు(టీసీఎస్‌) చేయనున్నారు.

Published : 29 Sep 2023 01:53 IST

విదేశీ పర్యటనల ప్యాకేజీలకూ
అక్టోబరు 1 నుంచి అమల్లోకి

దిల్లీ: విదేశీ పర్యటనల ప్యాకేజీ, లిబరలైజ్డ్‌ రెమిటెన్సిస్‌ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద విదేశాలకు భారతీయులు పంపే నిధుల విలువ రూ.7 లక్షలు మించితే అక్టోబరు 1 నుంచి మూలం వద్ద 20 శాతం పన్నును వసూలు(టీసీఎస్‌) చేయనున్నారు. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు పైగా పంపితే టీసీఎస్‌ 5 శాతంగా ఉంది. రూ.7 లక్షల వరకైతే ప్రస్తుతం ఎలాంటి టీసీఎస్‌ లేదు. ఇకపై కూడా ఇదే కొనసాగనుంది. మరోవైపు విదేశీ పర్యాటక ప్యాకేజీలకు ప్రస్తుతం 5% టీసీఎస్‌ ఉంది. అక్టోబరు 1 నుంచి రూ.7 లక్షల వరకు ప్యాకేజీకి 5 శాతం, అంతకుమించితే 20% టీసీఎస్‌ వర్తిస్తుంది. వైద్య చికిత్సలు, విద్యకు వార్షిక వ్యయం రూ.7 లక్షలు చొప్పున మించితే 5 శాతం టీసీఎస్‌ కట్టాలి. విదేశాల్లో చదువుల కోసం తీసుకునే రుణాల విలువ రూ.7 లక్షలు మించితే 0.5% టీసీఎస్‌ వర్తిస్తుంది. వాస్తవానికి ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశాలకు నిధులు పంపించడానికి, విదేశీ పర్యాటక ప్యాకేజీలకు టీసీఎస్‌ను జులై 1 నుంచి 20 శాతానికి పెంచాలని బడ్జెట్లోనే ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత దీనిని అక్టోబరు 1కి వాయిదా వేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద.. భారత్‌లోని ఒక వ్యక్తి ఆర్‌బీఐ అనుమతి లేకుండానే వార్షికంగా 2.5 లక్షల డాలర్ల వరకు పంపించొచ్చు. 2.5 లక్షల డాలర్లు లేదా అంతకుమించి విదేశీ కరెన్సీ రూపంలో పంపించాలంటే ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని