Reliance Industries: వార్తల్లో తరచూ కనిపించే కంపెనీ రిలయన్స్‌

ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ పరంగా.. మన దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ప్రసార మాధ్యమాల్లో (మీడియా) అత్యంత ఎక్కువగా కనిపించే కంపెనీల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది.

Updated : 21 Dec 2023 08:34 IST

ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
విజికీస్‌ న్యూస్‌ స్కోర్‌ నివేదిక

దిల్లీ: ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ పరంగా.. మన దేశంలో అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ప్రసార మాధ్యమాల్లో (మీడియా) అత్యంత ఎక్కువగా కనిపించే కంపెనీల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. ‘2023 విజికీస్‌ న్యూస్‌ స్కోర్‌ నివేదిక’ ఈ విషయాన్ని వెల్లడించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. విజికీస్‌ న్యూస్‌ స్కోర్‌ను.. వార్తల పరిమాణం, పతాక శీర్షికల ప్రాధాన్యం, పబ్లికేషన్ల సర్క్యులేషన్‌, పాఠకుల సంఖ్య ద్వారా గణిస్తారు. వార్తల్లో తరచు కనిపించే అంశాన్ని లెక్కించే పరామితి అయిన ఈ స్కోరును తొలిసారిగా తీసుకొచ్చినప్పటి నుంచీ అంటే నాలుగేళ్లుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఏటా స్కోరును మెరుగుపరచుకుంటూనే ఉంది.

  • 2023లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 96.46 స్కోరును సాధించింది. 2022లో 92.56, 2021లో 84.9 స్కోరు ఈ కంపెనీకి లభించింది. నెలవారీ విశ్లేషణ చూస్తే 2023 జూన్‌ నుంచి నవంబరు మధ్య 3 నెలల పాటు 98కి పైగా స్కోరును సంస్థ సాధించింది.
  • రిలయన్స్‌ 2023లో సాధించిన స్కోరు ఆ కంపెనీకి సంబంధించిన అన్ని వార్తలను చదివిన ఏకీకృత పాఠకుల సంఖ్య (7,400 కోట్లు) ఆధారంగా లభించింది.
  • ఎస్‌బీఐ 85.81 స్కోరు (4,690 కోట్ల మంది పాఠకుల)ను సాధించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 84.06 (4,240 కోట్ల పాఠకులు), ఐసీఐసీఐ బ్యాంక్‌ 81.9 (4,220 కోట్ల మంది), భారతీ ఎయిర్‌టెల్‌ 80.64 (4,030 కోట్ల పాఠకుల) స్కోరును దక్కించున్నాయి.
  • రిలయన్స్‌కున్న ప్రజా సంబంధాల(పీఆర్‌) సామర్థ్యం వల్లే మిగతా సంస్థలతో పోలిస్తే అందనంత దూరంలో ఉందని విజికీస్‌ పరిశోధన చెబుతోంది. రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌కు, రెండో స్థానంలో ఉన్న ఎస్‌బీఐకు భారీ అంతరం ఉండడానికి ఇదే ప్రధాన కారణం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని