పెద్దగా అంకురించలేదు

భారతీయ అంకురాలకు 2023 చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా అంకురాలకు పెట్టుబడుల విషయంలో ‘ఫండింగ్‌ వింటర్‌’ను పాటించడంతో దాని ప్రభావం మన అంకురాలపైనా పడింది.

Updated : 31 Dec 2023 23:15 IST

మూడొంతులు తగ్గిన పెట్టుబడులు
ఏడాదిలో రెండే యూనికార్న్‌లు
ఈనాడు - హైదరాబాద్‌

భారతీయ అంకురాలకు 2023 చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా అంకురాలకు పెట్టుబడుల విషయంలో ‘ఫండింగ్‌ వింటర్‌’ను పాటించడంతో దాని ప్రభావం మన అంకురాలపైనా పడింది. కొత్త ఏడాదిలోనైనా మంచి రోజులు వస్తాయా అని అంకుర వ్యవస్థాపకులు ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఎన్నో కొత్త అంకురాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎడ్యుటెక్‌, హెల్త్‌టెక్‌ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించింది. కానీ, 2022 నుంచి వీటికి గడ్డుకాలం మొదలయ్యింది. ఎంత వేగంగా వృద్ధిలోకి వచ్చాయో.. అదే రీతిలో పతనమయ్యాయి. అనేక సంస్థలు తమ వ్యాపారాలను మూసేశాయి. బైజూస్‌, ఫార్మ్‌ఈజీ వంటి సంస్థల విలువ 85-90 శాతానికి క్షీణించింది.

పెట్టుబడులు తగ్గాయ్‌..

అంకురాలకు కీలకం పెట్టుబడులు. ఈ ఏడాది అంకురాలకు వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ రూ.67,562 కోట్ల (8.14బిలియన్‌ డాలర్లు) మేరకే ఉంది. 2022లో ఈ పెట్టుబడులు దాదాపు రూ.2 లక్షల కోట్ల (24.3 బిలియన్‌ డాలర్ల ) వరకూ ఉన్నాయి. 2021లో రూ.2.90 లక్షల కోట్లు (35 బిలియన్‌ డాలర్లు)గా ఉన్నాయి. 2016లో వచ్చిన 4.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి తర్వాత ఇదే అత్యల్పం కావడం గమనార్హం. లెన్స్‌కార్ట్‌, ఉడాన్‌, బిల్డర్‌.ఏఐ, జెప్టో, పెరిఫియోస్‌ సాఫ్ట్‌వేర్‌ లాంటి సంస్థలకు అధిక మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి.

తగ్గిన యూనికార్న్‌లు...: దేశీయ యూనికార్న్‌ల (100 కోట్ల డాలర్ల విలువ) సంఖ్య 2023లో క్షీణించింది. 2022 నాటికి 110 యూనికార్న్‌లు ఉండగా, ఈ ఏడాది నవంబరు నాటికి వీటి సంఖ్య 72కు పడిపోయినట్లు ఫండమెంటమ్‌ పార్ట్‌నర్‌షిప్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో మొత్తం రెండు అంకురాలు మాత్రమే యూనికార్న్‌ హోదా సాధించాయి. ఇందులో జెప్టో, ఇన్‌క్రెడ్‌ ఉన్నాయి.  

‘లేఆఫ్‌’ల సంవత్సరం..

ఉద్యోగ నియామకాల విషయంలో 2023లో కాస్త గందరగోళ పరిస్థితులే కనిపించాయి. అంకుర సంస్థలు దాదాపు 16,398 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ అత్యధికంగా 2,500 మందికిపైగా ఉద్యోగులను పక్కన పెట్టింది.

పరిస్థితులు మారుతాయ్‌..

కొత్త ఏడాదిలో అంకురాలకు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ (వీసీ)సంస్థలు పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ముందుకు వస్తున్నాయని పెట్టుబడి అంశాలను పర్యవేక్షించే సంస్థలు చెబుతున్నాయి. అయితే, 2021తో పోలిస్తే మాత్రం తక్కువ స్థాయిలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


19 ఏళ్ల తర్వాత టాటాల ఐపీఓ

టాటా గ్రూప్‌ నుంచి 19 ఏళ్ల తర్వాత ఐపీఓ వచ్చింది. చివరి సారిగా 2004లో టీసీఎస్‌ ఐపీఓకు రాగా.. ఈ ఏడాదిలో టాటా టెక్నాలజీస్‌ నవంబరు 30న ఐపీఓకొచ్చింది. రూ.3,042 కోట్ల ఈ ఐపీఓకు నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్పందన వచ్చింది. గడువు పూర్తయ్యేసరికి 70 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 అయితే రూ.1200 వద్ద అంటే 140 శాతం ప్రీమియంతో లిస్టయింది. డిసెంబరు 29న రూ.1182 వద్ద స్థిరపడింది.


40 బిలియన్‌ డాలర్ల విలీనం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. భారత్‌లోనే అతిపెద్ద మార్కెట్‌ విలువ గల బ్యాంకు. హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రపంచవ్యాప్త ఎన్‌బీఎఫ్‌సీల్లో అందరికీ సుపరిచితమైన పేరు. ఈ రెండూ విజయవంతంగా 40 బిలియన్‌ డాలర్ల విలీనాన్ని పూర్తి చేసినట్లు జులై 1న ప్రకటించాయి. భారత కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఆ సయయంలో హెచ్‌డీఎఫ్‌సీ వాటాదార్లకు ప్రతీ 25 షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లభించాయి. విలీనం అయిన కొద్ది రోజులకే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను అధిగమించింది.


గోఫస్ట్‌.. రెక్కలు విరిగాయ్‌

మే 2.. ఈ తేదీ ముందు వరకు గోఫస్ట్‌లో అంతా బాగానే ఉందనుకున్నారు. ఆ రోజున స్వచ్ఛందంగా దివాలా ప్రక్రియకు ఆ కంపెనీ దరఖాస్తు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మొత్తం విమానాలన్నిటి కార్యకలాపాలనూ అదే రోజున నిలిపివేసింది. పలు బ్యాంకులు ఇక గోఫస్ట్‌కు డబ్బులిచ్చేది లేదని చెప్పాయి. అయితే దివాలాకు కారణం ప్రాత్‌ అండ్‌ విట్నీ ఇచ్చిన ఇంజిన్లేనని ఆరోపించిన గోఫస్ట్‌.. దీనిపై పరిహారాన్నీ కోరింది. ఇంజిన్‌ల వల్ల కంపెనీకి రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ ప్రమోటరు నస్లీ వాడియా ఇటీవలే పేర్కొన్నారు.


భారీ స్థాయిలో విమానాల ఆర్డర్లు

గోఫస్ట్‌ వంటి విమానయాన సంస్థ దివాలా ప్రకటించడం పక్కనపెడితే.. ఈ ఏడాదిలో అత్యంత భారీ స్థాయిలో విమానాలకు ఆర్డర్లు వెళ్లాయి. ముఖ్యంగా ఎయిరిండియా తన పునరుజ్జీవం కోసం ఏకంగా 470 విమానాలకు 70 బిలియన్‌ డాలర్లతో జూన్‌లో ఆర్డరు పెట్టింది. ఇందులో 250 ఎయిర్‌బస్‌ విమానాలు, 220 బోయింగ్‌ జెట్‌లు ఉన్నాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇండిగో సైతం ఎయిర్‌బస్‌ వద్ద 500 విమానాలకు ఆర్డరు చేసింది.


‘చిప్‌లు’ ఉడకలేదు

రోనా సమయంలో చిప్‌ కొరతను ఎదుర్కొన్న తర్వాత సెమీకండక్టర్‌ తయారీపై భారత్‌ మొగ్గుచూపింది. ముఖ్యంగా వేదాంతా-ఫాక్స్‌కాన్‌ సంయుక్త సంస్థ ఈ సంక్లిష్ట పరిశ్రమలోకి అడుగుపెడతామని ప్రకటించినపుడు పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. పీఎల్‌ఐ పథకం కింద గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాల్సింది కూడా. అయితే ఈ జేవీ నుంచి వైదొలుగుతున్నట్లు జులైలో ఫాక్స్‌కాన్‌ ప్రకటించింది. అయితే అమెరికా దిగ్గజం మైక్రాన్‌ మాత్రం సనంద్‌లో అసెంబ్లీ, టెస్టింగ్‌, మార్కింగ్‌, ప్యాకేజింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఊరటనిచ్చింది.


విడిగా.. ఐటీసీ హోటల్స్‌

టీసీ అనగానే సిగరెట్లు, హోటళ్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ వస్తువులు గుర్తుకు వస్తాయి. అయితే హోటళ్ల వ్యాపారాన్ని ‘ఐటీసీ హోటల్స్‌’గా విభజించడానికి ఐటీసీ ఈ ఏడాదిలోనే ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రతీ 10 ఐటీసీ షేర్లకు హోటళ్ల వ్యాపారంలో ఒక షేరును ఇవ్వనుంది. ఐటీసీ హోటల్స్‌ అనేది స్వతంత్రంగా కార్యకలాపాలు జరుపుతుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 2024లో ఐటీసీ హోటల్స్‌ లిస్టయ్యే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని