సంక్షిప్తవార్తలు(5)

విప్రో జీఈ హెల్త్‌కేర్‌ వచ్చే 5 ఏళ్లలో దేశంలో రూ.8,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.

Updated : 27 Mar 2024 06:43 IST

అయిదేళ్లలో విప్రో జీఈ హెల్త్‌కేర్‌ రూ.8,000 కోట్ల పెట్టుబడులు

దిల్లీ: విప్రో జీఈ హెల్త్‌కేర్‌ వచ్చే 5 ఏళ్లలో దేశంలో రూ.8,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. వైద్య పరికరాల స్థానిక తయారీని పెంచేందుకు, పరిశోధన-అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలపై ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ వైద్య సాంకేతికత, ఫార్మాస్యూటికల్‌ డయాగ్నోస్టిక్స్‌, డిజిటల్‌ పరిష్కారాలు అందిస్తున్న దిగ్గజ సంస్థ ఇది. తాము దేశీయంగా తయారు చేసిన పెట్‌ సీటీ డిస్కవరీ ఐక్యూ స్కానర్‌ను 15 దేశాలకు ఎగుమతి చేసినట్లు సంస్థ వివరించింది. రెవల్యూషన్‌ ఆస్పైర్‌ సీటీ, రెవల్యూషన్‌ ఏసీటీ, ఎంఆర్‌ బ్రెస్ట్‌ కాయిల్స్‌ను ప్రపంచం కోసం భారత్‌లోనే తయారీ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. మెడ్‌టెక్‌ రంగంలో దేశీయ, అంతర్జాతీయ విపణులు వృద్ధి చెందుతున్నందున, సరఫరా వ్యవస్థను నిర్మిస్తున్నామని.. ఇందుకోసం వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నామని విప్రో జీఈ హెల్త్‌కేర్‌ ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ వెల్లడించారు. విప్రో జీఈ హెల్త్‌కేర్‌ అనేది జీఈ ప్రెసిషన్‌ హెల్త్‌కేర్‌ ఎల్‌ఎల్‌సీ-యూఎస్‌ఏ, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ల సంయుక్త సంస్థ. 1990లో ఏర్పాటైంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


భారత జీడీపీ వృద్ధి 6.8%

2024-25 అంచనాలు పెంచిన ఎస్‌ అండ్‌ పీ

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదుకావొచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. గతేడాది నవంబరులో అంచనా వేసిన 6.4 శాతం కంటే ఇది ఎక్కువ. అయితే ఆర్థికాభివృద్ధికి అధిక వడ్డీ రేట్లు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వర్థమాన ఆసియా దేశాలు మంచి వృద్ధి సాధించే అవకాశం ఉందని, ముఖ్యంగా భారత్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం దేశాలు ముందంజలో ఉన్నాయని ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో ఎస్‌ అండ్‌ పీ పేర్కొంది. భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలను దేశీయ గిరాకీ నడిపిస్తోందని, అయితే అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబాల కొనుగోళ్ల శక్తిపై ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది. ద్రవ్యలోటు కూడా వృద్ధికి విఘాతం కావొచ్చని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కీలక రేట్లు 75 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గొచ్చని, ఇవన్నీ ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఉండొచ్చని భావిస్తున్నట్లు వివరించింది.


గౌతమ్‌తో సయోధ్యకు ప్రయత్నించడం లేదు!

రేమండ్‌ గ్రూప్‌ మాజీ అధినేత విజయపత్‌

దిల్లీ: తనయుడు గౌతమ్‌ సింఘానియాతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలను రేమండ్‌ గ్రూప్‌ మాజీ అధినేత విజయపత్‌ సింఘానియా తోసిపుచ్చారు. సామాజిక మాధ్యమాల్లో కుమారుడితో విజయపత్‌ ఉన్న ఫొటో చూసిన వారు, విభేదాలను పరిష్కరించుకుంటున్నారని భావించారు. దీనిపై విజయ్‌పత్‌ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తన కుమారుడు గౌతమ్‌ను కలవడానికి అయిష్టంగానే వెళ్లినట్లు వెల్లడించారు. అతను ఒక కప్పు కాఫీ తాగుతూ కలుద్దామని పట్టుబడితే వెళ్లినట్లు తెలిపారు. గౌతమ్‌తో తన ఫొటో తీసి, మీడియాకు తప్పుడు సంకేతాన్ని పంపేందుకు ఉద్దేశ పూర్వకంగా చేసినట్లు గ్రహించలేదని పేర్కొన్నారు. ఈ నెల 20న గౌతమ్‌ సింఘానియా తన ‘ఎక్స్‌’ ఖాతాలో తండ్రి విజయపత్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘మా నాన్న మా ఇంట్లో ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన ఆశీస్సులు కోరాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి నాన్నా’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. దీంతో వారిద్దరి మధ్య సయోధ్య యత్నాలు జరుగుతున్నాయన్న వార్తలొచ్చాయి.


దైమ్లర్‌ ఇండియా నుంచి కొత్త ట్రక్కులు

చెన్నై: భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ దైమ్లర్‌ ఇండియా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సరికొత్త వాహనాలను తీసుకురాబోతోంది. 2023లో బలమైన పని తీరు ప్రదర్శించిన సంస్థ, తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించడంపై దృష్టి పెట్టింది. జర్మనీ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న దైమ్లర్‌ ట్రక్‌ ఏజీ అనుబంధ సంస్థగా దైమ్లర్‌ ఇండియా ఇక్కడ భారత్‌ బెంజ్‌ వాహనాలు విక్రయిస్తోంది. ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) ట్రక్కులు, నిర్మాణ, గనుల తవ్వక రంగాల కోసం కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చింది. ‘భారత్‌ బెంజ్‌ శ్రేణి కొత్త ఉత్పత్తులు ప్రస్తుతం ఉన్న వాటి కంటే మరింత మెరుగ్గా ఉండబోతున్నాయి. సాంకేతికత, భద్రత, సౌకర్యం, సేవలు అన్నీ మెరుగు పరచినట్లు’ దైమ్లర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ముఖ్య వ్యాపార అధికారి (దేశీయ విక్రయాలు, కస్టమర్‌ సర్వీస్‌) శ్రీరామ్‌ వెంకటేశ్వరన్‌ వెల్లడించారు. కొత్త హెవీ-డ్యూటీ శ్రేణి ట్రక్కులు వచ్చే నెలలో విపణిలోకి రానున్నాయి. 6.7 లీటర్‌ కామన్‌-రైల్‌ బీఎస్‌-6 స్టేజ్‌ 2 భారత్‌ బెంజ్‌ ఇంజిన్‌తో ఉత్తమ డ్యూరబిలిటీ, డ్రైవబిలిటీతో అందుబాటులోకి రానున్నాయి. 12-స్పీడ్‌ ఏఎంటీ ట్రక్కును ప్రవేశపెట్టనుంది. ఇది క్లాస్‌-లీడింగ్‌ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది.


సెబీలో 97 ఆఫీసర్ల పోస్టులు

దరఖాస్తుల ఆహ్వానం

దిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) ఈ ఏడాది వివిధ విభాగాల్లో 97 మంది ఆఫీసర్లను నియమించుకోవాలని భావిస్తోంది. తన నియంత్రణ బాధ్యతలను వేగంగా, మరింత ప్రభావవంతంగా పూర్తి చేసేందుకు ఈ పోస్టులు అవసరమని తెలిపింది. సాధారణ, న్యాయ, సమాచార సాంకేతిక, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌, పరిశోధన-అధికార భాష విభాగాల్లో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు అర్హులైన భారతీయులే దరఖాస్తు చేసుకోవాలని  తెలిపింది. ఇందులో సాధారణ విభాగంలోనే 62 మందిని నియమించుకోనుంది. 24 మందిని సమాచార సాంకేతిక విభాగంలో, అయిదుగురిని న్యాయ బృందంలో, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్‌, పరిశోధన-అధికార భాష విభాగాల్లో చెరో ఇద్దరిని ఎంపిక చేయాలనుకుంటోంది. ఎంపిక ప్రక్రియ 3 దశల్లో ఉండనుంది. తొలి దశ ఆన్‌లైన్‌ పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఈ దశ పూర్తయితే రెండో దశలో మరో రెండు పేపర్లు ఆన్‌లైన్‌లోనే రాయాల్సి ఉంటుంది. ఎంపికైన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించి తుది ఎంపిక చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని