ఇండోసోల్‌లో ఉత్పత్తి 31న ప్రారంభం

సౌర విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన మాడ్యూల్స్‌, ప్యానెళ్లు, ఇతర పరికరాలను తయారు చేసే ఇండోసోల్‌ సోలార్‌, తన ఉత్పత్తి ప్లాంటు తొలి దశను ఈ నెల 31న ప్రారంభించనుంది.

Published : 27 Mar 2024 01:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ కేంద్రాలకు అవసరమైన మాడ్యూల్స్‌, ప్యానెళ్లు, ఇతర పరికరాలను తయారు చేసే ఇండోసోల్‌ సోలార్‌, తన ఉత్పత్తి ప్లాంటు తొలి దశను ఈ నెల 31న ప్రారంభించనుంది. భారత ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకంలో భాగంగా 10 గిగావాట్‌ సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అనుమతి పొందింది. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, ఇండోసోల్‌ సోలార్‌ దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నంలో ఆ రాష్ట్రప్రభుత్వం కేటాయించిన 30 ఎకరాల స్థలంలో, రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో తొలి దశ కింద 500 మెగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తిని ఈ నెలాఖరుకు ప్రారంభిస్తున్నట్లు సంస్థ సీఈఓ శరత్‌ చంద్ర మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ ఏడాది చివరికి 4 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటామన్నారు. 2026 నాటికి పూర్తి స్థాయి 10 గిగావాట్‌ ఉత్పత్తిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అప్పటికి తమకు 8,000 ఎకరాల భూమి అవసరమవుతుందని, మొత్తం పెట్టుబడి రూ.25,000 కోట్ల వరకు ఉంటుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 23వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని