రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె

సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి.

Published : 10 May 2024 02:39 IST

22000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
సమీక్ష

సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. తొలి 3 దశల ఎన్నికల్లో అధికార భాజపాకు సీట్లు తగ్గొచ్చన్న భయాలు ఇందుకు కారణమయ్యాయి. ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ సహా అన్ని రంగాల షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 22,000 పాయింట్ల దిగువకు చేరింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు పెరిగి 83.48 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.48% లాభంతో 83.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • సూచీల నష్టాల నేపథ్యంలో, మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గురువారం ఒక్కరోజే రూ.7.34 లక్షల కోట్లు తగ్గి రూ.393.34 లక్షల కోట్ల (4.71 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది. ఈనెల 2న జీవనకాల గరిష్ఠమైన రూ.408.49 లక్షల కోట్లకు చేరిన మదుపర్ల సంపద, అక్కడ నుంచి రూ.15 లక్షల కోట్లు కోల్పోయింది.
  • సెన్సెక్స్‌ ఉదయం 73,499.49 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఏదశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 72,334.18 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 1062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 21,957.50 దగ్గర స్థిరపడింది.
  • ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో టీవీఎస్‌ మోటార్‌ షేరు 5.73% లాభపడి రూ.2,121.30 వద్ద ముగిసింది.
  • త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో ఎల్‌ అండ్‌ టీ షేరు 6% క్షీణించి రూ.3,276.15 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.28,737.44 కోట్లు తగ్గి రూ.4.50 లక్షల కోట్లకు పరిమితమైంది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 నష్టాలు నమోదుచేశాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 4.68%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.64%, ఐటీసీ 3.56%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.88%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.86%, ఎన్‌టీపీసీ 2.71%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.47%, టాటా స్టీల్‌ 2.44%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.29%, రిలయన్స్‌ 1.77% డీలాపడ్డాయి. టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌ 1.77% వరకు లాభపడ్డాయి.
  • 15 నుంచి గో డిజిట్‌ ఐపీఓ: ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూప్‌ పెట్టుబడులున్న గో డిజిటల్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ ఈ నెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ.1,125 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 5.47 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు.
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీ రేట్లు యథాతథం: బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కీలక వడ్డీ రేట్లను 5.25% వద్ద యథాతథంగా ఉంచింది. బ్రిటన్‌ ద్రవ్యోల్బణం రెండున్నరేళ్ల కనిష్ఠమైన 3.2 శాతానికి చేరినప్పటికీ.. కేంద్ర బ్యాంక్‌ లక్ష్యమైన 2 శాతం ఎగువనే ఉంది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపింది. దీంతో త్వరలోనే వడ్డీ రేట్ల కోతలు ప్రారంభం కావొచ్చన్న అంచనాలు పెరిగాయి.
  • గురుగ్రామ్‌లో విలాస గృహ ప్రాజెక్ట్‌లో మొత్తం 795 ఫ్లాట్లను రూ.5,590 కోట్లకు విక్రయించినట్లు డీఎల్‌ఎఫ్‌ ప్రకటించింది. ప్రాజెక్ట్‌ ఆవిష్కరించిన 3 రోజుల్లోనే ఇవి బుక్‌ అయినట్లు తెలిపింది.
  • యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లకు స్థిరమైన ‘బీబీ+’ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు ఫిచ్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. సానుకూల నిర్వహణ వాతావరణం, భారీ దేశీయ ఫ్రాంఛైజీలను ఇందుకు కారాణాలు పేర్కొంది.
  • టీసీఎస్‌ సీఈఓకు రూ.25.36 కోట్ల వేతనం: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓ, ఎండీ కె.కృతివాసన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.25.36 కోట్ల వేతనం అందుకున్నారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. జీతం కింద రూ.1.27 కోట్లు, ప్రయోజనాలు, పారితోషికాలు, అలవెన్సుల కింద రూ.3.08 కోట్లు, కమీషన్‌ రూపంలో రూ.21 కోట్లు పొందారు. 2023 జూన్‌లో కృతివాసన్‌ టీసీఎస్‌ పగ్గాలు చేపట్టారు. కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి (సీఓఓ) ఎన్‌జీ సుబ్రమణియమ్‌కు రూ.26.18 కోట్ల వేతనం లభించడం విశేషం.
  • ఇఫ్కోతో మారుత్‌ డ్రోన్స్‌ భాగస్వామ్యం: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 5 లక్షల ఎకరాల్లో డ్రోన్‌ల ద్వారా ఎరువులు, పురుగుల మందు పిచికారీ చేసేందుకు ఇఫ్కోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మారుత్‌ డ్రోన్స్‌ వెల్లడించింది.  ఇఫ్కో వ్యవసాయ ఉత్పత్తులనే మారుత్‌ డ్రోన్స్‌ వినియోగించనుంది. కార్మికుల కొరత సమస్య, డ్రోన్‌ల వినియోగంతో తీరుతుందని మారుత్‌ డ్రోన్స్‌ సహవ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్‌ కుమార్‌ అన్నారు.

నేటి బోర్డు సమావేశాలు: టాటా మోటార్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, సిప్లా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, ఏబీబీ ఇండియా, థెర్మాక్స్‌, కల్యాణ్‌ జువెలర్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని