కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్‌

బైజూస్‌ బ్రాండ్‌ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ తన కోర్సు సబ్‌స్క్రిప్షన్‌ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది.

Updated : 10 May 2024 03:00 IST

దిల్లీ: బైజూస్‌ బ్రాండ్‌ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ తన కోర్సు సబ్‌స్క్రిప్షన్‌ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. కంపెనీ సేల్స్‌ అసోసియేట్లు, మేనేజర్లతో జరిగిన సమావేశంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్‌ ఈ ప్రకటన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌ ఇక రూ.12,000 వార్షిక ధరపై లభించనుంది. బైజూస్‌ క్లాసెస్‌ రూ.24,000, బైజూస్‌ ట్యూషన్‌ సెంటర్స్‌ (బీటీసీ) రూ.36,000 ధరకు సేవలందించనున్నాయ’ని ఈ పరిణామాలతో దగ్గరి సంబంధమున్న వ్యక్తులు తెలిపారు. ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇవి దాదాపు 30-40% తక్కువ కావడం గమనార్హం. విక్రయ బృందానికి ఇవ్వాల్సిన అన్ని బకాయిలు చెల్లించడంతో పాటు, ప్రోత్సాహకాలు పెంచేందుకూ బైజు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘సేల్స్‌ అసోసియేట్లు చేసిన విక్రయాలపై తదుపరి పనిదినాన 100 శాతం ప్రోత్సాహకాలను, మేనేజర్లు అందులో 20% పొందుతార’ని ఆయన ప్రకటించినట్లు సమాచారం.


ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ లాభం రూ.808 కోట్లు

చెన్నై: ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.808 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.650 కోట్లతో పోలిస్తే ఇది 24 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.6,622 కోట్ల నుంచి రూ.9,106 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం కూడా రూ.5192 కోట్ల నుంచి పెరిగి రూ.6,629 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 7.44 శాతం నుంచి 3.10 శాతానికి; నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.83 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గింది. దీంతో కేటాయింపులు కూడా రూ.1,028 కోట్ల నుంచి తగ్గి రూ.409 కోట్లకు పరిమితమయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐఓబీ నికర లాభం రూ.2,098 కోట్ల నుంచి రూ.2,656 కోట్లకు పెరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని