ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది సమ్మె విరమణ

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్యాబిన్‌ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Published : 10 May 2024 02:38 IST

అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని కంపెనీ హామీ
25 మంది తొలగింపు నిర్ణయం వెనక్కి

ముంబయి/దిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్యాబిన్‌ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా.. 25 మందికి జారీ చేసిన తొలగింపు లేఖలను కూడా వెనక్కి తీసుకోవడానికి కంపెనీ అంగీకరించిందని, సర్వీసు నిబంధనల ప్రకారం కంపెనీ సమీక్ష జరపనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

రాజీ కుదరడంతోనే: యాజమాన్యం, ఉద్యోగుల యూనియన్‌(ఏఐఎక్స్‌ఈయూ)తో చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌(సెంట్రల్‌) కార్యాలయంలో 5 గంటల పాటు జరిగిన రాజీ సమావేశంలో చర్చలు ఫలవంతం కావడం ఇందుకు నేపథ్యం. 25 మందికిచ్చిన టర్మినేషన్‌ లేఖలను కంపెనీ ఉపసంహరించుకున్నట్లు సమావేశం అనంతరం యూనియన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. మే 28న ఇంకోసారి సమావేశమై ఇరు వర్గాలు సమస్యలపై చర్చిస్తారని వివరించారు. మంగళవారం రాత్రి కొంత మంది సీనియర్‌ క్యాబిన్‌ సిబ్బంది మూకుమ్మడి అనారోగ్య సెలవు పెట్టడంతో గురువారం రాత్రి సమయానికి మొత్తం 170కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లాల్సిన విమానాలూ ఇందులో ఉన్నాయి. ‘మాకున్న 368 విమానాల్లో గురువారం 283 మాత్రమే నడిపాం. మా 20 మార్గాల్లో ఎయిరిండియా విమానాలను నడపనుంది. అయినప్పటికీ 85 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింద’ని ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.

పూర్తి రిఫండ్‌ లేదా రీ షెడ్యూలు: ఒక వేళ విమానం రద్దు అయినా.. లేదా మూడు గంటల కంటే ఎక్కువగా ఆలస్యమైనా.. పూర్తి రిఫండ్‌ లేదా తర్వాతి తేదీకి ఎటువంటి ఫీజు లేకుండా రీషెడ్యూలు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కాగా, సమ్మె విరమణతో విమానాల షెడ్యూలును పునః ప్రారంభించడానికి వీలవుతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని