ఎస్‌బీఐ రికార్డు లాభాలు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది.

Published : 10 May 2024 02:40 IST

ముంబయి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. స్టాండలోన్‌ ఖాతాల ప్రకారమూ.. 2022-23 మార్చి త్రైమాసికం నాటి    రూ.16,694.51 కోట్ల నుంచి రూ.20,698.35 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 3.13% పెరిగి రూ.41,655 కోట్లకు చేరుకుంది. వడ్డీయేతర ఆదాయం 24.41% పెరిగి రూ.17,369 కోట్లకు చేరడం కలిసి వచ్చింది.

పూర్తి ఆర్థికానికి: 2022-23తో పోలిస్తే 2023-24లో ఎస్‌బీఐ ఏకీకృత నికర లాభం రూ.55,648.17 కోట్ల నుంచి రూ.67,084.67 కోట్లకు పెరిగింది. త్రైమాసిక, వార్షిక లాభాలు జీవనకాల గరిష్ఠాలకు చేరాయని బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15-16 శాతంగా ఉండొచ్చని ఖరా అంచనా వేశారు. దేశీయ నికర వడ్డీ మార్జిన్‌    3.46% వద్దే కొనసాగొచ్చని అన్నారు. 2023-24లో డిపాజిట్లు 11.13% వృద్ధి చెందగా.. 2024-25 ఏడాదికి 13% లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రభావం ఉండదు.. ఖరా: నిర్మాణంలో ఉన్న మౌలిక ప్రాజెక్టుల రుణాలపై ఆర్‌బీఐ ముసాయిదా నిబంధనలు అమల్లోకి వచ్చినా, ఎస్‌బీఐపై ప్రభావం చూపవని ఖరా అన్నారు. ఆ రుణాలను రీప్రైసింగ్‌ చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. 2023-24లో ప్రాజెక్టు రుణాల నుంచి ఎటువంటి ఒత్తిడీ ఎదురు కాలేదన్నారు. రూ.4 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాల్లో నాలుగింట మూడొంతులు ప్రైవేటు రంగానికి ఇవ్వగా,  మిగతావి ప్రభుత్వ రంగానికి చేరినట్లు తెలిపారు. నిరర్థక ఆస్తులకు కేటాయింపులు  రూ.8,049 కోట్ల నుంచి రూ.7,927 కోట్లకు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఒత్తిడికి గురవుతున్న రుణాలు రూ.3,185 కోట్ల నుంచి రూ.3,867 కోట్లకు పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2.78% నుంచి 2.24 శాతానికి తగ్గింది. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 2.42 శాతంగా ఉన్నాయి.

తగ్గిన ఉద్యోగుల సంఖ్య: గత నాలుగేళ్లలో ఉద్యోగుల సంఖ్య 27,000 వరకు తగ్గడాన్ని ప్రస్తావిస్తూ,  యాంత్రీకరణ (ఆటోమేషన్‌) వల్లేనని ఖరా అన్నారు. సాంకేతికత, కృత్రిమ మేధ టూల్స్‌పై పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. 12,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు, అసోసియేట్లలో 85% మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లే కావడంతో.. టెక్‌ కార్యకలాపాల్లోనూ నియమిస్తున్నట్లు వివరించారు. 2023-24లో 139 శాఖలు జతకావడంతో మొత్తం బ్యాంకు శాఖలు 22,542కు చేరాయి. ఈ ఏడాదిలో మరో 300 జత చేయనున్నారు.

గురువారం సూచీలు భారీగా నష్టపోయినా, ఎస్‌బీఐ షేరు మాత్రం బీఎస్‌ఈలో గురువారం 1.14% లాభంతో రూ.819.65 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని