సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్‌

దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో మారుతీ స్విఫ్ట్‌ ఒకటి. దీని 2024 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ గురువారం విడుదలైంది.

Published : 10 May 2024 02:40 IST

ధరల శ్రేణి రూ.6.5-9.64 లక్షలు

దిల్లీ: దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో మారుతీ స్విఫ్ట్‌ ఒకటి. దీని 2024 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ గురువారం విడుదలైంది. స్విఫ్ట్‌లో కొత్తగా 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ జెడ్‌ సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను మారుతీ సుజుకీ ఇండియా తీసుకొచ్చింది. 5-స్పీడ్‌ మాన్యువల్‌/ 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో తెచ్చిన ఈ కారు ధరల శ్రేణి రూ.6.50-9.64 లక్షలు. మొత్తం 5 వేరియంట్లలో లభ్యమవుతోంది. కొత్త స్విఫ్ట్‌ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను మారుతీ అందిస్తోంది. లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఫ్రాంక్స్‌, బ్రెజా, బాలెనో కార్ల తరహాలో ప్రీమియం లుక్‌ వచ్చేలా ఈ కారు క్యాబిన్‌ను తీర్చిదిద్దారు. యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉంది. టాప్‌ ఎండ్‌ మోడల్‌లో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌, 360 డిగ్రీల కెమేరా, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వెనక భాగంలో ఏసీ వెంట్స్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. డిజైన్‌ పరంగా బంపర్‌ను మార్చారు. కొత్త గ్రిల్‌ అమర్చారు. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో హెడ్‌ల్యాంప్‌లను ఇచ్చారు. వెనక భాగంలోనూ స్కిడ్‌ ప్లేట్‌తో కూడిన కొత్త బంపర్‌ ఇచ్చారు.

చిన్న కార్ల విభాగాన్ని బలోపేతం చేస్తాం

చిన్న కార్ల విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని మారుతీ ఎండీ, సీఈఓ హిసాషి టకుచి వెల్లడించారు. మళ్లీ ఈ విభాగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1,000 మందికి 600 కార్లు ఉండగా, భారత్‌లో 32 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కార్లు వార్షికంగా 7 లక్షలు విక్రయమవుతుండగా, 2030 నాటికి 10 లక్షల స్థాయికి చేరతాయనే అంచనా ఉందన్నారు. ఎస్‌యూవీ బాడీ స్టైల్‌తో కంపెనీ తొలి ఈవీ (విద్యుత్‌ వాహనం) మోడల్‌ రాబోతోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని