ఈక్విటీ ఫండ్‌ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్‌

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ.

Published : 10 May 2024 02:39 IST

ఏప్రిల్‌లో రూ.18,917 కోట్లే
సిప్‌ల మదుపు రూ.20,000 కోట్ల మైలురాయికి

దిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ల్లోకి పెట్టుబడులు గణనీయంగా తగ్గడం, సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్కెట్లలో ఒడుదొడుకులు పెరగడంతో, మదుపర్లు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పాటించడం ఇందుకు నేపథ్యం. అయితే ఈక్విటీ ఫండ్‌ల్లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగడం ఇది వరుసగా 38వ నెల కావడం గమనార్హం.

  • నెలవారీ క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్‌) ద్వారా మదుపు రూ.20,000 కోట్ల మైలురాయిని అందుకుంది. ఏప్రిల్‌లో రూ.20,371 కోట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. మార్చిలో సిప్‌ల ద్వారా మదుపు రూ.19,271 కోట్లుగా ఉంది. సిప్‌ ఖాతాల సంఖ్య కూడా 63.65 లక్షల మేర పెరిగి 8.7 కోట్లకు చేరింది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) గణాంకాల ప్రకారం..
  • ఏప్రిల్‌లో మొత్తంగా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోకి రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.1.6 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డెట్‌ పథకాల్లోకి గణనీయ స్థాయిలో రూ.1.9 లక్షల కోట్లు రావడం వల్లే, ఏప్రిల్‌లో ఎంఎఫ్‌లలోకి అధిక పెట్టుబడులు నమోదయ్యాయి.
  • డెట్‌, ఈక్విటీ ఫండ్‌ పథకాల్లోకి నికర పెట్టుబడుల రాక కొనసాగడంతో ఏప్రిల్‌ చివరికి ఫండ్‌ పథకాల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.57.26 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి ఈ విలువ రూ.53.54 లక్షల కోట్లుగా ఉంది.
  • స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ విభాగం పుంజుకుంది. మార్చిలో ఈ తరహా పథకాల్లో నుంచి రూ.94 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఏప్రిల్‌లో నికరంగా రూ.2,208 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ల్లోకి రూ.357 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో వచ్చిన రూ.2,218 కోట్లతో పోలిస్తే ఏప్రిల్‌లో పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గింది.
  • హైబ్రిడ్‌ ఫండ్‌ పథకాల్లోకి పెట్టుబడులు మార్చిలో రూ.5,584 కోట్లు కాగా, ఏప్రిల్‌లో రూ.19,863 కోట్లకు చేరాయి.
  • మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాల సంఖ్య ఏప్రిల్‌లో జీవనకాల గరిష్ఠమైన 18.14 కోట్లుగా నమోదైంది.

రుణ భారం వల్లే పొదుపు తగ్గింది!

దిల్లీ: కుటుంబాల పొదుపు గత ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గి ఉండొచ్చని అంచనా. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీద పెరగడంతో, నెలవారీ కిస్తీలు అధికంగా చెల్లించాల్సి రావడం వల్ల కుటుంబాల పొదుపుపై ప్రభావం పడి ఉండొచ్చని తెలుస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వ్యక్తిగత రుణాల మంజూరుపై ఇటీవల ఆంక్షలు విధించిన నేపథ్యంలో, 2024-25లో ఈ ధోరణిలో మార్పు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నికర కుటుంబాల పొదుపు వరుసగా మూడేళ్ల నుంచి తగ్గుతోందని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబాల నికర పొదుపు 2020-21తో పోలిస్తే, 2022-23కు రూ.9 లక్షల కోట్ల మేర తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. 2023-24 గణాంకాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. హామీ రహిత (అన్‌సెక్యూర్డ్‌) వ్యక్తిగత రుణాల జారీపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో, 2024-25లో కుటుంబాల పొదుపు పెరగొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థిక వేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. పొదుపునకు సంబంధించి పోర్ట్‌ఫోలియో మార్పులతో కుటుంబాల పొదుపు తగ్గినట్లు కనిపించినా, పొదుపు మొత్తాలు స్థిరాస్తుల్లోకి వెళ్లాయని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు.

  • 2020-21లో కుటుంబాల పొదుపు రూ.23.29 లక్షల కోట్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. 2021-22లో రూ.17.12 లక్షల కోట్లకు, 2022-23లో రూ.14.16 లక్షల కోట్లకు తగ్గింది.
  • 2022-23లో ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), కుటుంబాలకు అందించిన రుణాలు నాలుగింతలు పెరిగి రూ.3.33 లక్షల కోట్లకు చేరాయి. 2020-21లో ఇవి రూ.93,723 కోట్లుగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని