ఆరోగ్య బీమా.. టాపప్‌తో అదనపు రక్ష

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి అనారోగ్యం వచ్చినా.. ఆర్థిక లక్ష్యాలన్నీ తారుమారైపోతున్నాయి.

Updated : 22 Sep 2023 00:19 IST

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి అనారోగ్యం వచ్చినా.. ఆర్థిక లక్ష్యాలన్నీ తారుమారైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా ఒక తప్పనిసరి అవసరంగా మారింది. వైద్య అత్యవసరాల్లో ఆర్థికంగా అండగా నిలుస్తుంది. చాలామంది ఒక పాలసీ తీసుకొని, తమకు తగినంత రక్షణ ఉందని భావిస్తుంటారు. మరోవైపు అధిక ప్రీమియాలూ వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య బీమాకు టాపప్‌ చేయించుకోవడం మంచిది.

సంజయ్‌ కుటుంబం మొత్తానికీ వర్తించేలా రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నారు. ఇది సరిపోతుందనే నమ్మకంతోనే ఉన్నారు. అనుకోకుండా సంజయ్‌ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్స కోసం రూ.9 లక్షల వరకూ ఖర్చయ్యింది. రూ.5లక్షలు ఆరోగ్య బీమా  చెల్లించగా, మిగతా రూ.4 లక్షలు జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం దాచిన మొత్తాన్ని దానికి ఉపయోగించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎవరూ ఊహించలేరు. ఖర్చు ఎంతవుతుందన్నదీ చెప్పలేం. కాబట్టి, వీలైనంత అధిక మొత్తానికి రక్షణ ఉండటమే ఎప్పుడూ దీనికి పరిష్కారం. అలా అని పెద్ద మొత్తంలో బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం భారంగా మారుతుంది. ఇక్కడే టాపప్‌ ప్లాన్‌లు
అవసరం వస్తాయి.

ఏమిటివి?

టాపప్‌ ప్లాన్లు ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా కొనుగోలు చేసేందుకు వీలున్న ఒక అనుబంధ పాలసీలుగా చెప్పొచ్చు. ప్రాథమిక పాలసీ ఖర్చయిన తర్వాతే ఈ టాపప్‌ పాలసీలు మిగతా మొత్తాన్ని భరిస్తాయి. సంజయ్‌ ఉదాహరణే తీసుకుంటే.. రూ.5లక్షల ప్రాథమిక పాలసీ.. మరో రూ.5 లక్షల టాపప్‌ పాలసీ ఉందనుకుందాం. ముందుగా ప్రాథమిక పాలసీ రూ.5లక్షలు ఆసుపత్రి బిల్లు చెల్లిస్తుంది. ఆ తర్వాత మిగిలిన రూ.4 లక్షలను టాపప్‌ పాలసీ ఇస్తుంది. టాపప్‌ తీసుకునేప్పుడే.. ఎంత మొత్తం తర్వాత వర్తించాలన్నది ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతో పోలిస్తే టాపప్‌లకు తక్కువ ప్రీమియం వర్తిస్తుంది. ఒకే సంస్థ నుంచి ఆరోగ్య బీమా పాలసీ, టాపప్‌ పాలసీని తీసుకోవచ్చు. లేదా రెండు పాలసీల కోసం వేర్వేరు సంస్థలనూ ఎంచుకోవచ్చు.  

ఎలా పని చేస్తాయి?

టాపప్‌ పాలసీలు నిర్ణీత పరిమితికి మించి వైద్య ఖర్చులు అయినప్పుడే ఆ బిల్లులను భరిస్తాయి. ఉదాహరణకు రూ.5లక్షల తర్వాతే టాపప్‌ వర్తించేలా తీసుకోవచ్చు. లేదా రూ.10లక్షల ఖర్చు తర్వాత వర్తించేలానూ చూసుకోవచ్చు. వైద్య బిల్లులు ఈ పరిమితికి మించినప్పుడు మాత్రమే టాపప్‌ ప్లాన్‌ వైద్య ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది.

ఎంత మేరకు..

టాపప్‌ ప్లాన్లను రూ.50వేల నుంచి రూ.15 లక్షల వరకూ తీసుకోవచ్చు. రూ.30వేల నుంచి రూ.5లక్షల వరకూ పరిమితి దాటాక వర్తించేలా ఎంచుకోవచ్చు. సంస్థలను బట్టి ఈ మొత్తాలు మారేందుకు అవకాశం ఉంది. సాధారణ బీమా పాలసీతో పోలిస్తే టాపప్‌ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ప్రీమియానికి చెల్లించే మొత్తం ఆదా అవుతుంది. రూ.5 లక్షల మినహాయింపుతో రూ.10 లక్షల టాపప్‌ పాలసీని తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో అవసరం. దీనికి బీమా సంస్థలను బట్టి, రూ.5,000 వరకూ ప్రీమియం ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు బీమా సంస్థలను సంప్రదించండి.  

లాభాలేమిటి?

  • టాపప్‌ ప్లాన్లను తీసుకునేందుకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్య బీమా పాలసీ ఉన్న సంస్థ నుంచి లేదా, ఇతర సంస్థ నుంచి తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదు. టాపప్‌ పాలసీలు ఆసుపత్రిలో అయిన ఖర్చులతోపాటు, అంబులెన్స్‌, అవయవ దాత ఖర్చులు, రెండో వైద్య అభిప్రాయం తదితర ఖర్చులకూ వర్తిస్తుంది.  

ప్రాథమిక ఆరోగ్య పాలసీ మొత్తం పూర్తయిన సందర్భాల్లో టాపప్‌ ప్లాన్‌లు అదనపు రక్షణ అందిస్తాయి. ప్రాథమిక ఆరోగ్య పాలసీని తీసుకున్న తర్వాత, మీ అవసరాన్ని బట్టి టాపప్‌ పాలసీని ఎంచుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని