Gita Gopinath: ‘గీత’లు చెరిపేస్తూ.. మరో ఘనత సాధించిన గీతా గోపీనాథ్‌..!

ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్‌.

Updated : 07 Jul 2022 13:59 IST

వాషింగ్టన్‌: ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌ (Gita Gopinath). అంతకుముందు ఐఎంఎఫ్ తొలి మహిళా ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. తాజాగా నెట్టింట్లో షేర్ చేసిన చిత్రం.. ఆమె సాధించిన ఘనతను చాటుతోంది.  

ఇప్పటివరకూ ఐఎంఎఫ్‌కు ప్రధాన ఆర్థికవేత్తలుగా పనిచేసిన వారి ఫొటోలను గోడపై అమర్చిన చిత్రాన్ని గీత ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ ఫొటోల్లో చివరిది గీతదే. ఆ జాబితాలో ఉన్నవారిలో ఆమె ఒక్కరే మహిళ. దానిపై స్పందిస్తూ..‘ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ.. ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తలుగా పనిచేసిన వ్యక్తుల సరసన నా చిత్రం కూడా చేరింది’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు అభినందనలు తెలియజేశారు. ‘ఆర్థికాంశాలు గురించి ఆలోచించే వారి ముఖంలో ఆనందాన్ని తీసుకువస్తారు. అలాగే భారత్‌లోని పేదల గురించి ఆలోచన చేయండి. ఎందుకంటే వారు తమ గురించి ఆలోచించలేని స్థితిలో ఉన్నారు’ అంటూ ఒక ట్విటర్‌ యూజర్‌ కోరారు.

గీతా గోపీనాథ్‌ గురించి ఆసక్తికర విషయాలు..

  • 1971లో కోల్‌కతాలో జన్మించారు. మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.
  • దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌లో బి.ఎ పూర్తి చేశారు. 1992లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. ఎకనామిక్స్‌ అభ్యసించారు.
  • వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో మరోసారి ఎం.ఎ. ఎకనామిక్స్‌లో చదివే అవకాశం రావడంతో తన ఐఏఎస్‌ ప్రణాళికలను పక్కన పెట్టేశారు. అనంతరం ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు.
  • అక్కడి నుంచి 2010లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ ఉండగానే 2018లో ఐఎంఎఫ్‌లో పనిచేసే అవకాశం తలుపు తట్టింది.
  • గీతా గోపీనాథ్‌కు ఫ్యాషన్‌ రంగంలోనూ అనుభవం ఉంది. దిల్లీ వర్సిటీలో ఆమె తన భర్త ఇక్బాల్‌ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతం వీరికి 18 ఏళ్ల రాహిల్‌ అనే అబ్బాయి ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని