జీవిత బీమా.. మీ బాధ్యతలను తీర్చేలా

మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్‌ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది.

Published : 15 Sep 2023 01:13 IST

మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్‌ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు మీరు రెండు రకాలుగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ఒకటి.. మీరు పొదుపు, పెట్టుబడుల ద్వారా మీ లక్ష్యాల సాధనకు అవసరమైన మొత్తాన్ని కూడబెట్టడం. అదే సమయంలో అనుకోకుండా కుటుంబానికి దూరం అయినప్పుడు వారికి అండగా ఉండేందుకు కావాల్సినంత మొత్తాన్ని అందించేలా ఒక ఆర్థిక రక్షణను ఏర్పాటు చేయడం. ఈ రెండు అవసరాలనూ తీర్చేందుకు జీవిత బీమా పాలసీలు తోడ్పడతాయని చెప్పొచ్చు.

కుటుంబంలో ఆదాయం సంపాదించే వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి ఏర్పడే ఆర్థిక లోటును బీమా పాలసీలు తీరుస్తాయి. దీనివల్ల సాధారణ వేతనం తరహాలోనే ఆర్థిక ప్రయోజనాలను అందుకునేందుకు అవకాశం కుటుంబ సభ్యులకు కలుగుతుంది. ఇది భవిష్యత్‌ ప్రధాన బాధ్యతల కోసం కూడబెట్టిన పొదుపు మొత్తాలను వెనక్కి తీసుకోకుండా కాపాడుతుంది. జీవిత బీమా పథకాలు కుటుంబానికి అవసరమైన ఆర్థిక రక్షణ అందిస్తాయి. బీమా చేసిన వ్యక్తి తీసుకున్న రుణాలను తీర్చడంలోనూ ఇది సాయం చేస్తుంది.

దీర్ఘకాలిక అవసరాల కోసం..

పిల్లలను విదేశాల్లో చదివించడం, ఇల్లు కొనడం, వైద్య పరమైన అత్యవసర పరిస్థితులు ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. వీటన్నింటినీ తీర్చేందుకు క్రమం తప్పకుండా పొదుపు, పెట్టుబడులు అవసరం అవుతాయి. ఏదైనా దురదృష్టం వెన్నాడినప్పుడు ఈ బాధ్యతల పరిస్థితి ఏమిటి?
బీమా సంస్థలు అందించే పొదుపు పథకాలు ఆర్థిక రక్షణ, సంపద వృద్ధి రెండింటి ప్రయోజనాన్ని అందిస్తాయి. పాలసీ గడువు పూర్తయ్యే నాటికి మంచి మొత్తం అందించడం ద్వారా మీ లక్ష్యాలను తీరుస్తాయి.

పదవీ విరమణ తర్వాత...

సాధారణంగా 58-60 ఏళ్లకు పదవీ విరమణ చేస్తారు. అక్కడి నుంచి జీవితాంతం వరకూ ఆర్థిక అవసరాలు తీరేలా పదవీ విరమణ ప్రణాళికలోనూ బీమా పాలసీలు సాయం చేస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్నీ దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రణాళికలు ఉండాలి. ఉదాహరణకు ఈ రోజు రూ.15,000ల విలువ 10 ఏళ్ల తర్వాత 7 శాతం ద్రవ్యోల్బణంతో చూస్తే సగమే అవుతుంది. పదవీ విరమణ తర్వాత ఆరోగ్య అవసరాలూ కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి మీ పొదుపు మొత్తాలపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, పదవీ విరమణ తర్వాత నిధులు తగ్గకుండా బీమా పాలసీలు తోడ్పడతాయి.
జీవిత బీమా పాలసీలు అందించే యాన్యుటీ పాలసీలు ఇందుకు తోడ్పడతాయి. జీవితాంతం వరకూ ఆదాయం అందుకొని, తర్వాత జీవిత భాగస్వామికి ఆదాయం వచ్చే ఏర్పాటు చేయొచ్చు. ఆ తర్వాత అసలు మొత్తాన్ని నామినీకి చెల్లించేలా చూడొచ్చు. పింఛను అందించడంతో పాటు, వారసులకు కొంత మొత్తం అందేలా పాలసీని ఎంచుకోవచ్చు.

జీవితంలోని ప్రతి దశలోనూ ఏదో ఒక బాధ్యత ఉంటుంది. వాటిని తీర్చేలా బీమా పాలసీలను ఎంచుకోవడం వల్ల ఒక నమ్మకమైన ఆర్థిక తోడు ఉంటుందని చెప్పొచ్చు. అనుకోని సంఘటనలు మీ కలల్ని దెబ్బతీయకుండా అవి చూస్తాయి.

విఘ్నేశ్‌ షహానే, ఎండీ-సీఈఓ, ఏగాస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని