ఇంటి కోసం సిద్ధం ఇలా

సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది

Published : 22 Dec 2023 00:09 IST

సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది. అవేమిటి? రుణం తీసుకునేటప్పుడు ఏ విషయాలు చూడాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 గృహరుణం ఒక దీర్ఘకాలిక బాధ్యత. మిగతా రుణాలతో పోలిస్తే ఇది తక్కువ వడ్డీకే అందుబాటులో ఉంటుంది. కానీ, వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వడ్డీ భారమూ అదే స్థాయిలో ఉంటుంది. రుణం తీసుకునే ముందు చేతి నుంచి కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్‌ పరిభాషలో దీన్ని డౌన్‌పేమెంట్‌ లేదా మార్జిన్‌ మనీ అని పిలుస్తుంటారు. గృహరుణం తీసుకునేటప్పుడు మీ ఇంటి విలువలో ఎంత మొత్తం సొంతంగా చెల్లించాలి, ఎంత రుణం ఇస్తారన్నది ముందే తెలుసుకోవాలి. మీరు అధిక మొత్తం డౌన్‌ పేమెంట్‌ చేస్తే, మంచి వడ్డీ రేటుకు రుణాన్ని తీసుకునేందుకు వీలవుతుంది. మరి, ఈ మార్జిన్‌ మొత్తాన్ని చెల్లించేందుకు మనం ఎలా సిద్ధం కావాలన్నది తెలుసుకుందాం.

  • ఆర్థిక ప్రణాళికలో కీలకం డబ్బును ఆదా చేయడం. వచ్చిన ఆదాయాన్ని బట్టి, 50:30:20 నియమాన్ని పాటించేందుకు ప్రయత్నించండి. మీ నెలవారీ జీతంలో 50% స్థిరమైన నెలవారీ ఖర్చులకు వెళ్లాలి. 30 శాతం ఇతర వ్యయాలకు కేటాయించాలి. మిగిలిన 20% పొదుపు, పెట్టుబడులకు మళ్లించాలి. ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా డౌన్‌పేమెంట్‌కు అవసరమైన మొత్తాన్ని సాధించేందుకు వీలవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బును జమ చేయాలంటే.. పెట్టుబడుల వాటాను పెంచుకుంటూ వెళ్లాలి.
  • చిన్న చిన్న మార్పులే రేపు పెద్ద ప్రయోజనాన్ని కలిగిస్తాయి. రెండు మూడేళ్లపాటు ఖర్చులపై నియంత్రణ సాధిస్తే.. పెట్టుబడుల కోసం 30 శాతం లేదా 40 శాతం ఆదాయాన్ని కేటాయించేందుకు వీలవుతుంది. ఇంటి అద్దె ఎక్కువగా ఉంటే.. సొంతిల్లు కొనే వరకూ చిన్న ఇంటికి మారిపోండి. కొత్త వాహనం కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేయండి. విహార యాత్రల విషయాన్ని మరోసారి ఆలోచించుకోండి. ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండొచ్చు. కానీ, పెద్ద మొత్తం జమ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి త్యాగాలు తప్పవు.
  • ఇంటి కొనుగోలు కోసం మార్జిన్‌ మొత్తాన్ని సాధించేందుకు 3-5 ఏళ్లు పట్టొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇది ఆధారపడి ఉంటుంది. మీరు ఏడాది లోపు ఇల్లు కొనాలని నిర్ణయించుకుంటే.. మీ పెట్టుబడి మొత్తాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎఫ్‌డీలు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, ఈపీఎఫ్‌లాంటి వాటి నుంచి డబ్బు తీసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలూ అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఇవి మీకు భారం    అవుతాయి.
  •  నష్టాన్ని భరించే శక్తిని బట్టి పెట్టుబడులను ఎంచుకోవాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డెట్‌ ఫండ్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎన్నాళ్లపాటు డబ్బును పెట్టుబడి పెట్టబోతున్నారు అనేది చూసుకొని, అందుకు అనుగుణంగా పథకాలను ఎంచుకోవాలి. సొంతిల్లు జీవితంలో ఒక కీలక మైలురాయి. దీన్ని సాధించే క్రమంలో ఎలాంటి పొరపాట్లూ చేయొద్దు.

గౌరవ్‌ మోహతా, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని