బేరమాడితే తగ్గేను ప్రీమియం

కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు.

Updated : 15 Sep 2023 09:04 IST

కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు. కాబట్టి, పాలసీ పునరుద్ధరణ విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ఇదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ప్రీమియం భారాన్ని కొంత మేరకు తగ్గించుకునే వీలూ ఉంటుంది.

కారు బీమా పునరుద్ధరణ అంటే.. ఎలాంటి ప్రశ్నలు లేకుండా బీమా కంపెనీ చెప్పిన ప్రీమియాన్ని చెల్లించడం కాదు. సరైన బీమా రక్షణ ఉందా, ప్రీమియం ఎంత మేరకు తగ్గించుకునే వీలుఉంది అనే ప్రశ్నలు వేయాలి. మెరుగైన ధర పొందేందుకు కొన్ని అంశాలను పరిశీలించాలి.

తేదీలను చూడండి..: థర్డ్‌ పార్టీ (టీపీ), ఓన్‌ డ్యామేజీ (ఓడీ) పాలసీల పునరుద్ధరణ ఒకే రోజు ఉండకపోవచ్చు. కాబట్టి, మీ పాలసీ గడువు ముగుస్తుంది అనుకున్నప్పుడు ఈ రెండింటినీ గమనించడం చాలా అవసరం. ఈ తేదీలను అర్థం చేసుకొని, అందుకు అనుగుణంగా బీమాను పునరుద్ధరణ చేసుకోవాలి. దీనివల్ల అధిక మొత్తం చెల్లించకుండా చూసుకోవచ్చు.

అనుబంధ పాలసీలు: మీ ప్రత్యేక అవసరాలను చూసుకోండి. వీటికోసం ఏమైనా ప్రత్యేక పాలసీలు అవసరమా అని పరిశీలించండి. ఈ అదనపు రక్షణలు మీ సమగ్ర పాలసీకి బలం చేకూరుస్తాయి. క్లెయిం చేసేటప్పుడు మీరు ఎదుర్కొనే ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి.

వరదల్లో ఇంజిన్‌కు రక్ష: వరదలు లేదా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉండే వాహన యజమానులు తప్పనిసరిగా ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ను తీసుకోవడం మంచిది. ఇంజిన్‌ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఈ అనుబంధ పాలసీ రక్షణ కల్పిస్తుంది.

వినియోగ ఆధారిత పాలసీలు: కొన్ని బీమా సంస్థలు మీ డ్రైవింగ్‌, మైలేజీని పరిగణనలోకి తీసుకొని, వినియోగ ఆధారిత బీమా పాలసీలను అందిస్తాయి. మీరు సురక్షితమైన డ్రైవర్‌ అయితే... దీన్ని ఎంచుకోవడం వల్ల తక్కువ ప్రీమియాన్ని  చెల్లించే వీలుంటుంది.

రోడ్డుపై వాహనం ఆగితే: అనుకోని పరిస్థితుల్లో రోడ్డుపై వాహనం ఆగిపోయినప్పుడు రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌ పాలసీ ఉపయోగపడుతుంది. వాహనం మరమ్మతు, ప్రమాదం ఇలా సందర్భం ఏదైనా వాహనదారుడికి కావాల్సిన సహాయం వెంటనే అందించేలా ఇది తోడ్పడుతుంది.

గ్యారేజ్‌ నెట్‌వర్క్‌: బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు విస్తృతమైన గ్యారేజ్‌ నెట్‌వర్క్‌ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మరమ్మతు, క్లెయిం సులభం అవుతుంది.

చెల్లింపుల చరిత్ర: బీమా సంస్థ చెల్లింపుల చరిత్రను పరిశీలించండి. ఎన్ని కేసులను, ఎంత వేగంగా పరిష్కరించారో పరిశోధించండి. ఆ తర్వాతే ఆ కంపెనీ నుంచి పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి.

విలువ తగ్గితే: వాహనం బీమా విలువ (ఐడీవీ) తగ్గితే ప్రీమియం ఆ మేరకు తగ్గుతుంది. కానీ, ఏదైనా ప్రమాదంలో వాహనం దెబ్బతింటే.. వచ్చే పరిహారంలో కోత పడుతుంది. కాబట్టి, ఐడీవీ తగ్గకుండా చూసుకోండి.

నో క్లెయిం బోనస్‌: దీన్ని ఎన్‌సీబీగా పిలుస్తారు. దీన్ని క్లెయిం చేసుకుంటే.. బీమా ప్రీమియంలో రాయితీ లభించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి, చిన్న చిన్న మొత్తాలకు క్లెయిం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం. ఎన్‌సీబీని కూడబెట్టడం వల్ల కాలక్రమేణా బీమా ప్రీమియం తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

పాలసీని పునరుద్ధరించుకునేటప్పుడు, నిబంధనలు, షరతులను ఒకసారి పరిశీలించండి. మీ అనుమానాలన్నింటికీ సమాధానాలు వచ్చేలా చూసుకోండి. తక్కువ ప్రీమియానికి అందించేందుకు ఏం చేయగలరు అని అడగండి. ప్రీమియం తగ్గించుకునేందుకు కొంత సమయం వెచ్చించడం ఎప్పుడూ మంచిదే. అప్పుడే మీ కారూ, మీ జేబూ రెండూ సురక్షితంగా ఉంటాయి.

పూజా యాదవ్‌, చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌, జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు