GST Council: ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్ను.. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం

GST Council 50th meeting: ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. మొత్తం విలువపై ఈ పన్ను వర్తిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Updated : 11 Jul 2023 20:45 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, గుర్రపు పందేలపై (Online Gaming) ఎట్టకేలకు నిర్ణయం వెలువడింది. బెట్టింగ్‌ మొత్తంపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌ (GST council) నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) నేతృత్వంలో మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం జీఎస్టీ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్‌ మీడియాకు వెల్లడించారు. 

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై తొలుత ముఖ విలువ మీద పన్ను వేయాలా? గేమింగ్ ఆదాయంపై పన్ను వేయాలా? ప్లాట్‌ఫామ్‌ ఫీజు మీద మాత్రమే పన్నువేయాలా? అనేది మంత్రుల బృందం చర్చించింది. అయితే, మొత్తం విలువ మీద పన్ను విధించాలని కౌన్సిల్‌ నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నైపుణ్యానికి సంబంధించిన ఆటైనా, డబ్బుల పందెంతో ఆడే ఆటైనా ఆన్‌లైన్‌ గేమ్‌లకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే, క్యాన్సర్‌ ఔషధం దినుటక్సిమాబ్‌ (కార్జిబా)తో పాటు అరుదైన వ్యాధులతో బాధపడే రోగులు దిగుమతి చేసుకునే ఆహారంపై  జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్‌ నిర్ణయించిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రైవేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలనూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. సినిమా హాళ్లలో విక్రయించే ఆహారం, పానీయాలపై పన్ను 18శాతం కాకుండా 5శాతం విధించడంతో పాటు అప్పీలేట్‌ ట్రిబ్యునళ్ల ఏర్పాటు జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని