Sam Altman: ఆల్ట్‌మన్‌ పునరాగమనంలో ప్రతిష్టంభన.. ఆయన షరతులే కారణమా?

Sam Altman: ఓపెన్‌ఏఐ సీఈఓగా తిరిగి రావడానికి శామ్‌ ఆల్ట్‌మన్‌ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ, అందుకు కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 20 Nov 2023 12:42 IST

Sam Altman | శాన్‌ఫ్రాన్సిస్కో: ఉద్వాసనకు గురైన చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman)ను ఓపెన్‌ఏఐ సీఈఓగా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. తిరిగి వచ్చేందుకు ఆయన కొన్ని షరతులను విధిస్తుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

షరతులివేనా..?

బోర్డు నిర్మాణంతో పాటు బోర్డు బాధ్యతలు, అధికారాల విషయంలో శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) పలు మార్పులు చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న బోర్డు సభ్యులను తొలగించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తాను ఎలాంటి తప్పు చేయలేదని బహిరంగ ప్రకటన చేయాలని కూడా కోరుతున్నట్లు సమాచారం. తాను తిరిగి రావడానికి సిద్ధంగానే ఉన్నానని.. అయితే, ఈ షరతులకు అంగీకరించాలని ఆయన పట్టుబడుతున్నట్లు కొంతమంది వ్యక్తులు వెల్లడించారు.

వెనక్కి తగ్గిన బోర్డు?

ఆల్ట్‌మన్‌ తొలగింపుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల్లోని ఓ వర్గంతో పాటు ఓపెన్‌ఏఐ (OpenAI)లోని కొంతమంది కీలక సభ్యులు స్వచ్ఛందంగా వైదొలగుతామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులు తప్పుకోవడానికి సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ల వేటలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

వీరంతా ఆయన వెంటే..

ఆల్ట్‌మన్‌ (Sam Altman)తో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బ్రాక్‌మన్‌ సైతం బోర్డును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న వారిలో ఉన్నట్లు సమాచారం. తాత్కాలిక సీఈఓ మిరా మురాటీ, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ జేసన్‌ క్వోన్‌, సీఓఓ బ్రాడ్‌ లైట్‌క్యాప్‌ సైతం ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఓపెన్‌ఏఐ (OpenAI)లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఆల్ట్‌మన్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

అతిథిగా ఆఫీసుకు..

ఈ పరిణామాల నేపథ్యంలో బోర్డు సభ్యులు, ఆల్ట్‌మన్‌ (Sam Altman) మధ్య త్వరలోనే ఓ సయోధ్య కుదిరే అవకాశం ఉందని శాన్‌ఫ్రాన్సిస్కో వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఆదివారం మధ్యాహ్నం ఆల్ట్‌మన్‌ సహా బ్రాక్‌మన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.  ఓ అతిథిగా ఆఫీసుకు వెళ్లినట్లు ఆల్ట్‌మన్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. బహుశా ఈ హోదాలో రావడం తొలి, చివరిసారి ఇదేనని చెప్పడం గమనార్హం.

శామ్‌ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్‌ఏఐ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఆల్ట్‌మన్‌ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని