Amazon: ఒకే ఒక్క షేరు కొన్న అమెజాన్‌ అధినేత బెజోస్‌!

Amazon: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఒకే షేరు కొనడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది!

Updated : 13 Jun 2023 08:45 IST

వాషింగ్టన్‌: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్ (Jeff Bezos) ఇటీవల కంపెనీకి చెందిన ఒకే ఒక్క షేరును కొనుగోలు చేశారు. అదేంటి ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న వ్యక్తి.. ఒక్క షేరు కొనడమేంటి? అనుకుంటున్నారా! వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో వెల్లడించారు.

జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) 2002 తర్వాత షేరు కొనడం ఇదే తొలిసారి. అప్పటి నుంచి ఆయన అమ్మడమే తప్ప కొనింది లేదు. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 బిలియన్‌ డాలర్లు విలువ చేసే షేర్లను విక్రయించి వచ్చిన డబ్బును వివిధ వ్యాపారాల్లోకి మళ్లించారు. తాజాగా రెండు వారాల క్రితం 114.77 డాలర్లతో ఒక షేరు కొన్నారు. గత శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్‌ (Amazon) షేరు విలువ 124 డాలర్ల వద్ద స్థిరపడింది. అంటే బెజోస్‌ (Jeff Bezos) కొన్న షేరుపై 10 డాలర్ల లాభాన్ని ఆర్జించారు.

అమెజాన్‌ (Amazon) 1997లో పబ్లిక్‌ లిస్టింగ్‌కు వచ్చింది. అప్పటి నుంచి బెజోస్‌ (Jeff Bezos) ఒక్కసారి కూడా స్టాక్స్‌ను పరిహారంగా పొందలేదు. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 10 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఉన్న తన 148 బిలియన్‌ డాలర్ల సంపదలో అమెజాన్‌ (Amazon) షేర్ల వాటానే అధికం. తాజాగా బెజోస్ కేవలం ఒక్క స్టాక్‌ మాత్రమే కొనడం వెనకున్న వ్యూహం ఏంటనేది మాత్రం తెలియదు. అయితే, ఒక షేరును కొనడంతో పాటు ఎనిమిది మిలియన్‌ డాలర్లు విలువ చేసే 69,290 షేర్లను ఓ లాభాపేక్షలేని సంస్థకు విరాళంగా కూడా ఇచ్చారు. 

బెజోస్‌ (Jeff Bezos) ఒక్క షేరు మాత్రమే కొనుగోలు చేయడంపై సోషల్‌ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కొంతమంది సరదాగా పోస్ట్‌లు పెడుతున్నారు. బహుశా బెజోస్‌ (Jeff Bezos) ఎవరికైనా అమెజాన్‌ షేరును బహుమతిగా ఇవ్వడానికి తీసుకొని ఉండొచ్చని ఓ వ్యక్తి ట్వీట్‌ చేశాడు. మరొకరేమో అనుకోకుండా క్లిక్‌ చేయడం వల్ల అలా జరిగిపోయి ఉంటుందని మరొకరు ఫన్నీగా కామెంట్‌ చేశాడు. బహుశా ఒక్క షేరు కొంటే బెజోస్‌ (Jeff Bezos)కు కంపెనీలో నియంత్రిత వాటా దక్కుతుందేమో అని ఇంకొకరు అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని