Jio Swiggy plan: స్విగ్గీ వన్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌

Jio Swiggy festive prepaid plan: పండగ సీజన్‌ నేపథ్యంలో జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేవాళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్విగ్గీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Published : 08 Nov 2023 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో.. కస్టమర్ల అభిరుచి, అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్‌ ప్లాన్ల (Jio Prepaid Plan)ను తీసుకొస్తుంటుంది. తాజాగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకొని ఓ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు స్విగ్గీతో చేతులు కలిపింది. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు జియో తెలిపింది.

ప్లాన్‌ వివరాలు..

రూ.866తో రీఛార్జ్‌ చేసుకుంటే ‘స్విగ్గీ వన్‌ లైట్‌’ (Swiggy One Lite subscription) మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ప్లాన్‌ ప్రారంభ ఆఫర్‌ కింద ఇప్పుడు రీఛార్జ్‌ చేసుకునే వారికి రూ.50 క్యాష్‌బ్యాక్‌ కూపన్‌ కూడా ఇస్తున్నట్లు జియో పేర్కొంది. ఇది మైజియో అకౌంట్‌లో ఉంటుందని.. తదుపరి రీఛార్జ్‌లో రూ.50 తగ్గింపు లభిస్తుందని తెలిపింది. ఫుడ్‌ డెలివరీ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చిన తొలి టెలికాం ప్లాన్‌ ఇదేనని జియో పేర్కొంది. ఈ ప్లాన్‌లో ఉచిత 5జీ డేటా, రోజుకు 2జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి. జియోయాప్‌లకు యాక్సెస్‌ కూడా లభిస్తుంది. ఇవన్నీ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.

స్విగ్గీ సబ్‌స్క్రిప్షన్‌తో..

స్విగ్గీ వన్ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ (Swiggy One Lite subscription)తో యూజర్లకు రూ.600 విలువ చేసే ప్రయోజనాలు ఉంటాయని జియో ఓ ప్రకటనలో తెలిపింది. రూ.149 కంటే ఎక్కువ విలువ చేసే ఫుడ్‌ ఆర్డర్లలో పదింటిపై ఉచిత హోమ్‌ డెలివరీ ఉంటుందని పేర్కొంది. రూ.199 కంటే ఎక్కువ విలువ చేసే 10 ఇన్‌స్టామార్ట్‌ ఆర్డర్లపై కూడా ఎలాంటి డెలివరీ ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇన్‌స్టామార్ట్‌, ఫుడ్‌ ఆర్డర్లపై సర్జ్‌ ఛార్జీ కూడా ఉండబోదని స్పష్టం చేసింది. ఫుడ్‌ డెలివరీ రెస్టారెంట్లు అందించే సాధారణ ఆఫర్లపై 30 శాతం అదనపు రాయితీ కూడా లభిస్తుందని తెలిపింది. రూ.60 కంటే అధిక విలువ చేసే స్విగ్గీ జీనీ డెలివరీలపైనా 10 శాతం రాయితీ ఉంటుందని వెల్లడించింది.

దాదాపు 40 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్న జియో.. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొస్తుంటుంది. క్రికెట్‌ టోర్నీల సమయంలో ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతుంటుంది. అలాగే సినీ ప్రియుల కోసం ఎప్పటికప్పుడు వివిధ ఓటీటీ యాప్‌లతో కూడిన ప్రీపెయిడ్‌ ప్లాన్లను రూపొందిస్తుంటుంది. ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.1,099, రూ.1,499. వ్యాలిడిటీ 84 రోజులు, అపరిమిత 5జీ డేటాతో పాటు, రోజుకి 2జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ కూడా లభిస్తాయి. రూ.1,099 ప్లాన్‌తో కేవలం నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే లభిస్తుంది. అదే రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్నవాళ్లకు పెద్ద స్క్రీన్‌లలో కూడా వీక్షించేలా నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ వస్తుంది. మరోవైపు జూన్‌లో జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో జియో ఐదు ప్లాన్లను తీసుకొచ్చింది. వీటి ధర రూ.269 నుంచి 789 మధ్య ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని