Mukesh Ambani: జేర్డ్‌ కుష్నర్‌ సోదరుడి సంస్థలో ముకేశ్‌ అంబానీ పెట్టుబడులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్న్‌ర్‌కు స్వయానా సోదరుడైన జోష్‌ కుష్నర్‌కు చెందిన త్రైవ్‌ క్యాపిటల్‌లో ముకేశ్‌ అంబానీ సహా పలువురు బిలియనీర్లు 3.3 శాతం వాటా కొనుగోలుకు సిద్ధమయ్యారు.

Published : 25 Jan 2023 18:19 IST

వాషింగ్టన్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు బిలియనీర్లు జోష్‌ కుష్నర్‌కు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ‘త్రైవ్‌ క్యాపిటల్‌’లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. బ్రెజిల్‌కు చెందిన జోర్గ్‌ పాలో లేమన్‌, ఫ్రాన్స్‌కు చెందిన జేవియర్‌ నీల్‌, కేకేఆర్‌ అండ్‌ కంపెనీ సహ- వ్యవస్థాపకుడు హెన్రీ క్రావిస్‌, వాల్ట్‌ డిస్నీ కంపెనీ సీఈఓ రాబర్ట్‌ ఇగర్‌, అంబానీ కలిసి 175 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నారు. తద్వారా వీరికి 3.3 శాతం వాటా లభించనుంది. ఈ మేరకు మంగళవారం త్రైవ్‌ క్యాపిటల్‌ ప్రకటన విడుదల చేసింది.

వీరి పెట్టుబడితో త్రైవ్‌ క్యాపిటల్‌ విలువ 5.3 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ 2021లో గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌నకు కొన్ని వాటాలు విక్రయించింది. గత ఏడాది ఆఖరుకు కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ 15 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జోష్‌ కుష్నర్‌.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు (ఇవాంకా ట్రంప్‌ భర్త) జేర్డ్‌ కుష్నర్‌కు స్వయానా సోదరుడు. త్రైవ్‌ క్యాపిటల్‌ను జోష్‌ 2009లో స్థాపించారు. ఆస్కార్‌ హెల్త్‌, కంపాస్‌, అఫర్మ్‌ హోల్డింగ్స్‌, ఓపెన్‌డోర్‌ టెక్నాలజీస్‌, యునిటీ సాఫ్ట్‌వేర్‌, హిమ్స్‌ అండ్ హెర్స్‌ హెల్త్‌, స్కిమ్స్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో త్రైవ్‌ పెట్టుబడులు ఉన్నాయి.

బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల జాబితాలో 84.7 బిలియన్‌ డాలర్లతో ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. లేమన్‌ 21.1 బి.డాలర్లు, క్రావిస్‌ 9.5 బి.డాలర్లు, నీల్‌ 8.1 బిలియన్‌ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని