LPG: దేశంలో భారీగా పెరిగిన ఎల్పీజీ కనెక్షన్లు.. 9 ఏళ్లలో డబుల్‌

LPG Revolution: దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత 9 ఏళ్లలో 17 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు పెరిగినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

Published : 20 Apr 2023 20:05 IST

దిల్లీ: దేశంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గడిచిన 9 ఏళ్లలో కొత్తగా 17 కోట్ల వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారు. దీంతో 2014 ఏప్రిల్‌లో 14.52 కోట్లుగా ఉన్న గ్యాస్‌ వినియోగదారుల సంఖ్య 2023 నాటికి 31.36 కోట్లకు చేరింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ఇందుకు దోహదం చేసింది. అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఎల్పీజీ సిలిండర్ల లభ్యత కూడా పెరిగింది. ఒకప్పుడు సిలిండర్‌ రావడానికి సగటున 7-10 రోజులు పట్టేది. ఇప్పుడు చాలా చోట్ల 24 గంటల్లోనే వంట గ్యాస్‌ ఇంటికి చేరుతోంది.

ప్రతి పేదవారికి గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలనే ఉద్దేశంతో 2016 మే 1న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో 5 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నా.. తర్వాత దాన్ని 8 కోట్లకు సవరించారు. మరింత మందికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో 2021 ఆగస్టు 10న ఉజ్వల్‌ 2.0ని కేంద్రం ప్రారంభించింది. 2022 జనవరి 31 నాటికి ఉజ్వల్‌ 2.0 తన లక్ష్యాన్ని చేరుకోవటంతో కేంద్రం ఆ పథకాన్ని పొడిగించింది. ఈ పథకం ద్వారా మరో 60 లక్షల కనెక్షన్లు అందించాలని కేంద్రం నిర్ణయించింది. 

2019-20లో ఉజ్వల యోజన వినియోగదారులు ఏడాదికి సగటున 3.01 సిలిండర్లు వినియోగించేవారు.. 2021-22 నాటికి ఆ సంఖ్య 3.66కి చేరింది. కొవిడ్‌ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా అర్హులైన వారికి దాదాపు 14 కోట్ల మందికి ఉచితంగా ఎల్‌పీజీ రీఫిల్స్‌ను కేంద్రం అందించింది. ఒకప్పుడు 14.2-కేజీ గ్యాస్‌ సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 5 కేజీల సిలిండర్లను కూడా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని