Air India: మహారాష్ట్ర సర్కారు చేతికి ఎయిరిండియా ఐకానిక్‌ భవనం

Air India: ముంబయిలోని ఎయిరిండియా ఐకానిక్‌ భవనం యాజమాన్య హక్కుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుంది.

Published : 14 Mar 2024 18:55 IST

Air India | దిల్లీ: ఎయిరిండియాకు చెందిన ప్రతిష్టాత్మక భవనం మహారాష్ట్ర ప్రభుత్వ వశమైంది. ఈ భవనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,601 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో దక్షిణ ముంబయిలోని నారిమన్‌ పాయింట్‌ వద్ద ఉన్న ఎయిరిండియా భవనం యాజమాన్య హక్కులను కేంద్రం.. మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆస్తుల బదిలీకి గురువారం ఆమోదం తెలిపింది.

‘‘ఏఐ అసెట్స్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ (AIAHL)కు చెందిన ఎయిర్ ఇండియా భవనాన్ని రూ.1,601 కోట్లకు మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి కేంద్రం ఆమోదించింది. ఈ నేపథ్యంలో కంపెనీ బకాయిపడిన రూ.298.42 కోట్లను మాఫీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (DIPAM) విభాగం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. 

జీడీపీ అంచనాలు పెంచిన ఫిచ్‌ రేటింగ్స్‌.. రేట్ల కోత అప్పుడే!

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిరిండియాను టాటాలకు విక్రయించినప్పుడు ఎయిర్‌లైన్స్‌కు చెందిన నాన్-కోర్ ఆస్తుల్ని అందులో చేర్చలేదు. దీంతో సంస్థకు చెందిన భూమి, భవనాలు వంటి రూ.14,718 కోట్ల విలువైన వాటిని AIAHLకి బదిలీ చేసింది. ఇందులో 1974లో నిర్మించిన ఐకానిక్‌ కూడా ఉంది. 23 అంతస్థుల ఈ భవనాన్ని ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుంది. దీన్ని సచివాలయంలోని కొన్ని విభాగాల కోసం ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూపు 2021 అక్టోబరులో రూ.18,000 కోట్లకు బిడ్డింగ్‌లో దక్కించుకుంది. దీంతో 2022 జనవరి 27న ఎయిరిండియాను టాటా గ్రూప్‌ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని