ఇకపై బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌

mahila samman savings certificate: మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ స్కీమ్‌కు పోస్టాఫీసుల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, కొన్ని ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లోనూ ఇక నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 28 Jun 2023 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి వరకు ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌’ (mahila samman savings certificate) ఖాతాను పోస్టాఫీసుల్లో మాత్రమే తెరవడానికి మహిళలకు అవకాశం ఉండేది. ఇప్పుడు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకంలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ప్రైవేట్‌ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకుల్లో కూడా ఈ స్కీమ్‌లో చేరడానికి మహిళలకు అవకాశం ఉంది.

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌: ఎక్కువ మంది మహిళలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో మహిళల కోసం వన్‌-టైమ్‌ సేవింగ్స్‌ స్కీం అయిన ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌’ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మహిళ తన కోసం లేదా మైనర్‌ బాలిక తరఫున సంరక్షకుడు ఖాతాను తెరవొచ్చు.

వడ్డీ: ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం. దీనిపై 7.5% ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్‌ చేసిన మొత్తం, వడ్డీ కలిపి ఇస్తారు.

కాలవ్యవధి: ఈ స్కీమ్‌ కాలవ్యవధి రెండేళ్లు మాత్రమే. ఈ స్కీమ్‌ 2023, ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మాత్రమే మదుపు చేయడానికి అవకాశం ఉంది. డిపాజిట్‌ను 2 ఏళ్లు ఉంచితే, వడ్డీ కూడా 2 ఏళ్ల సమయానికి మాత్రమే చెల్లిస్తారు. మెచ్యూరిటీ అనంతరం కూడా డిపాజిట్‌ను ఈ స్కీమ్‌లో ఉంచేస్తే.. 2 ఏళ్ల తర్వాత కాలానికి పొదుపు ఖాతా వడ్డీ మాత్రమే దక్కుతుంది.

డిపాజిట్‌: ఈ పథకం కింద కనీస డిపాజిట్‌ రూ.1000, గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలు. ఒకసారి రూ.2 లక్షల్లోపు డిపాజిట్‌ చేస్తే మళ్లీ డిపాజిట్‌ చేయడానికి 3 నెలలు వేచి ఉండాలి.

ఉపసంహరణ: ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత, అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40% ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతిస్తుంది.

మెచ్యూరిటీకి ముందే ఖాతాను క్లోజ్‌ చేయొచ్చు: ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఖాతాను ముందుగానే మూసేయొచ్చు. ఖాతాదారుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సంబంధిత పత్రాలను సమర్పించి ఖాతాను ముందుగానే క్లోజ్‌ చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో డిపాజిట్‌, వడ్డీ కలిపి ఇచ్చేస్తారు. అయితే, ఖాతా తెరిచిన 6 నెలల తర్వాత ఎటువంటి కారణం చెప్పకుండా ఖాతాను మూసివేస్తే.. అప్పుడు వడ్డీపై 2% కోత విధిస్తారు. అంటే డిపాజిట్‌ మొత్తం 5.5% వడ్డీ మాత్రమే చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని