Medi Assist IPO: మెడి అసిస్ట్‌ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..!

Medi Assist IPO: రూ.1,172 కోట్ల సమీకరణ లక్ష్యంతో మెడి అసిస్ట్‌ ఐపీఓ జనవరి 15న ప్రారంభమైంది. 17వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు.

Published : 15 Jan 2024 11:21 IST

Medi Assist IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ అడ్మినిస్ట్రేటర్‌ మెడి అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ (Medi Assist Healthcare Services IPO) బుధవారం ప్రారంభమైంది. ధరల శ్రేణి రూ.397-418. గరిష్ఠ ధర వద్ద రూ.1,172 కోట్లు సమీకరించనుంది. ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.352 కోట్లు సమకూర్చుకుంది. జనవరి 17 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. మదుపర్లు కనీసం 35 షేర్లకు (ఒక లాట్‌) రూ.14,630 పెట్టుబడిగా పెట్టాలి.

ఈ ఐపీఓలో (Medi Assist Healthcare Services IPO) ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. ప్రమోటర్లు, పెట్టుబడిదారులు తమ వాటాలో నుంచి 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. దీంతో ఈ పబ్లిక్‌ ఇష్యూలో సమీకరించిన నిధులు పూర్తిగా వారికే చెందనున్నాయి. మెడి అసిస్ట్‌ను సాక్షి కబ్రా 2002లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభించారు. 2011లో బెస్సెమర్‌ వెంచర్స్‌ వాటాలు కొనుగోలు చేసింది. అదే సంవత్సరం అనిల్‌ అంబానీ గ్రూప్‌ 80 శాతం వాటాలు సొంతం చేసుకుంది. తర్వాత మెజారిటీ వాటాను ఇన్వెస్టర్‌కార్ప్‌కు విక్రయించింది. ప్రస్తుతం ఈ సంస్థ 21.65 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉంది.

దేశవ్యాప్తంగా 1,069 పట్టణాల్లో 18 వేల ఆస్పత్రులు మెడి అసిస్ట్‌ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దాదాపు 35 బీమా కంపెనీలు ఈ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ ప్రాథమిక కస్టమర్లు బీమా సంస్థలే. గ్రూప్‌ పాలసీల ద్వారానే అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడిక్లెయిమ్‌ సర్వీసుల నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతోంది. సెప్టెంబర్‌ 2023 నాటికి 6,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మెడి అసిస్ట్‌ ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: జనవరి 15-17
  • ధరల శ్రేణి: రూ.397-418
  • షేరు ముఖ విలువ: రూ.5
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 35 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,630
  • అలాట్‌మెంట్ తేదీ: జనవరి 18
  • రిఫండ్‌ తేదీ: జనవరి 19
  • లిస్టింగ్‌ తేదీ: జనవరి 22

(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని