Mark Zuckerberg : మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మంచి బాస్‌ కాదట.. మెటా మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం!

తమ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ (Mark Zuckerberg) మంచి బాస్‌ కాదని మెటా (Meta) మెజారిటీ ఉద్యోగులు (Employees) భావిస్తున్నట్లు ఓ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై వారు పెదవి విరిచినట్లు తేలింది.

Published : 12 Jun 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఫేస్‌బుక్‌ (Facebook) మాతృసంస్థ మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ (Mark Zuckerberg) తన కంపెనీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇటీవలి కాలంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో ఉద్యోగుల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. 

మెటాను తిరుగులేని సంస్థగా నిలబెట్టేందుకు సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఇటీవల కొన్ని సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా ఈ ఏడాదిని ‘సమర్థత సంవత్సరం’గా ప్రకటించాడు. ఈ సందర్భంగా కంపెనీని మరింత బలంగా, అతి చురుకైన సంస్థగా తీర్చిదిద్దే యోచనతో ఉన్నట్లు అంతర్గత సమావేశంలో వెల్లడించాడు. అయితే ఆయన తీసుకున్న మెజారిటీ నిర్ణయాలు ఉద్యోగులకు ఏ మాత్రం నచ్చలేదు. గతేడాది 11 వేల ఉద్యోగాలకు కోత పెట్టిన జుకర్‌బర్గ్‌.. ఈ ఏడాది మార్చిలో మరో 10వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మెటాలో ఓ అంతర్గత సర్వే చేపట్టగా ఉద్యోగుల్లో ఎక్కువ మంది జుకర్‌ బర్గ్‌ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. కేవలం 26 శాతం మంది మాత్రమే ఆయన నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక వెల్లడించింది.

మంచి బాస్‌ కాదట!

సర్వే నివేదిక ప్రకారం 26 శాతం మంది ఉద్యోగులు జుకర్‌ బర్గ్‌ నాయకత్వాన్ని నమ్ముతున్నారు. గతేడాది అక్టోబరులో నిర్వహించిన సర్వేలో ఈ సంఖ్య కేవలం ఐదు శాతమే అధికంగా ఉందట. ఈ ఏడాది మేలో మెటా తమ ఉద్యోగులకు లే ఆఫ్‌లు ప్రకటించింది. తాజా సర్వే అంతకు ముందే చేపట్టినా ఎక్కువ మంది జుకర్‌ బర్గ్‌ మంచి బాస్‌ కాదనే అభిప్రాయం వ్యక్త పరిచారు. ఇక 43 శాతం మంది ఉద్యోగులు కంపెనీలో తమ పనికి విలువ ఉందని భావిస్తున్నారట. మూకుమ్మడి తొలగింపుల కారణంగా ఉద్యోగుల్లో  నైతిక స్థ్యైర్యం దెబ్బతింటోందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో 10 వేల మందిని తొలగించాలని మెటా తొలుత భావించింది. తరువాత ఆ సంఖ్యను 4వేలకు పరిమితం చేసింది. మిగిలిన 6 వేల మందికి మేలో లే ఆఫ్‌లు ప్రకటించింది. ఇలా తొలగించిన వారిలో ఎక్కువ శాతం మంది పనిలో సమర్థులేనట. అయినప్పటికీ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఉద్వాసనలు జరిగాయి.

ఎక్కువ స్థిరత్వం.. తక్కువ ఉద్యోగస్వామ్యం

మెటా సీఈవో జుకర్‌ బర్గ్‌ ఆలోచన ఉద్యోగుల అభిప్రాయానికి భిన్నంగా ఉంది. ఆయన కంపెనీలో ఎక్కువ స్థిరత్వం, తక్కువ ఉద్యోగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఓ సమావేశంలో చెబుతూ మెటా ‘స్క్రాపియర్‌ ప్లేస్‌’లో ఉండాలని ఆకాంక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని