Anant Ambani: అనంత్‌ కోసం రాధిక స్పెషల్‌ ఎంట్రీ.. ముకేశ్‌ అంబానీ ఎమోషనల్‌

Anant Ambani pre-wedding event: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తన కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో ఎమోషనల్‌ అయ్యారు. పక్కన ఉన్న సతీమణి నీతా ఆయనను ఓదార్చారు.

Updated : 06 Mar 2024 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు (pre-wedding event) అట్టహాసంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను ‘హస్తాక్షర్‌ (Hastakshar)’ కార్యక్రమంతో ముగించారు. ఆ సమయంలో కొత్త జంటను చూసి అంబానీ కుటుంబమంతా ఆనందంతో భావోద్వేగానికి గురైంది. ముఖ్యంగా ముకేశ్‌ అంబానీ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.

ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. హస్తాక్షర్‌ కార్యక్రమంలో అనంత్‌ కోసం రాధిక స్పెషల్‌ ఎంట్రీ ఇచ్చారు. ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ సినిమాలోని పాటను పాడుతూ వేదిక వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఆమె ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అది చూసి అనంత్‌ కళ్లు ఆనందంతో చెమర్చాయి. ఈ క్షణాల కోసం ఎదురుచూస్తున్న ముకేశ్‌ అంబానీ భావోద్వేగంతో కంటతడి పెట్టుకోగా, పక్కనే ఉన్న ఆయన సతీమణి నీతా ఆయనను ఓదార్చారు.

అంతకుముందు ఇదే వేడుకల్లో అనంత్‌ తన ఆరోగ్య సమస్యలపై మాట్లాడుతుండగా ముకేశ్‌ తీవ్ర ఉద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. ‘‘ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ను స్పెషల్‌గా చేసేందుకు గత రెండు నెలలుగా మా కుటుంబమంతా కేవలం 3 గంటలే నిద్ర పోయింది. మీ అందరికీ తెలుసు.. నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు. ఎన్నో ముళ్లు గుచ్చుకున్న బాధనూ అనుభవించా. చిన్నప్పటినుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’’ అని చెప్పారు. కుమారుడి మాటలకు ముకేశ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా మార్చి 1-3 వరకు ఈ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారికి అంబానీ కుటుంబం గ్రాండ్‌గా ఆతిథ్యమిచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని