IPO updates: వచ్చేవారం నాలుగు ఐపీఓలు.. 7 లిస్టింగ్‌లు

IPO updates: వచ్చేవారం కూడా స్టాక్‌ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగనుంది. ఇందులో 2 మెయిన్‌బోర్డు ఐపీఓలు, 2 ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన ఐపీఓలు ఉన్నాయి.

Published : 17 Feb 2024 15:42 IST

IPO updates | ఇంటర్నెట్‌ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఐపీఓల (IPO) సందడి కొనసాగుతోంది. మార్కెట్లలో అనుకూల పరిస్థితులు ఉండడంతో ఈ ఏడాది పొడవునా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఈక్రమంలో వచ్చేవారం మరో నాలుగు ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. మెయిన్‌బోర్డు కేటగిరీలో జునిపెర్‌ హోటల్స్‌, జీపీటీ హెల్త్‌కేర్‌ రూ.2000 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వస్తున్నాయి. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో జెనిత్‌ డ్రగ్స్‌, డ్రీమ్‌ రోల్‌ టెక్‌ సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. మరోవైపు గత వారం సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చిన విభోర్‌ స్టీల్‌ సహా మరో ఆరు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన కంపెనీలు వచ్చే వారమే లిస్టింగ్‌కు రానున్నాయి.

జునిపెర్‌ హోటల్స్‌ ఐపీఓ: హయత్‌ (Hyatt) బ్రాండ్‌పై హోటల్స్‌ను నిర్వహిస్తున్న జునిపెర్‌ హోటల్స్‌ సంస్థ ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. రూ.1800 కోట్లు ఇష్యూ ద్వారా సమీకరించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన ఫ్రెష్‌ షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.342-360గా నిర్ణయించింది. ఇందులో క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు 75 శాతం, 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు, 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మార్కెట్‌ నుంచి సమీకరించిన నిధులను రుణాలు తిరిగి చెల్లించేందుకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు.

జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓ: ఐఎల్ఎస్‌ హాస్పిటల్‌ బ్రాండ్‌పై మధ్యస్థాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న కోల్‌కతాకు చెందిన జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓ ఫిబ్రవరి 22న ప్రారంభమై 26తో ముగియనుంది. ఐపీఓ ధరల శ్రేణి వెల్లడి కాలేదు. రూ.40 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా 2.6 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయానికి ఉంచనున్నారు. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా సమకూరిన నిధులను రుణాల తిరిగి చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు.

ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో జెనిత్‌ డ్రగ్స్‌ ఐపీఓ ఫిబ్రవరి 19న ప్రారంభమై.. 22 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.40.6 కోట్లు సమీకరించనుంది. డ్రీమ్‌రోల్‌ టెక్‌ ఐపీఓ ఫిబ్రవరి 20న ప్రారంభమై 22న ముగియనుంది. రూ.29 కోట్లు సమీకరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని