Sam Altman: బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను పెళ్లాడిన ఓపెన్‌ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్‌

Sam Altman: కొంతకాలంగా తనతో సహ జీవనం చేస్తున్న బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ వివాహమాడారు.

Updated : 12 Jan 2024 11:15 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ కృత్రిమ మేథ సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (OpenAI CEO Sam Altman) తన బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను (Oliver Mulherin) పెళ్లాడారు. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. తర్వాత ఆల్ట్‌మన్‌ (Sam Altman) ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హవాయ్‌ నగరంలో సముద్రపు ఒడ్డున కొంతమంది సన్నిహితుల మధ్య వీరు ఒక్కటైనట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాకు చెందిన మల్హెరిన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన లింక్డిన్‌ ప్రొఫైల్‌ ప్రకారం.. మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. 2020 ఆగస్టు నుంచి 2022 నవంబర్‌ వరకు మెటాలో పనిచేశారు. ఆల్ట్‌మన్‌, మల్హెరిన్‌ .. తమ బంధం గురించి ఎప్పుడూ బటయ మాట్లాడిన సందర్భాలు లేవు. 2023 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. ఇద్దరమూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒకే ఇంట్లో ఉంటున్నామని ఆల్ట్‌మన్‌ తొలిసారి వెల్లడించారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందుకు ఆల్ట్‌మన్‌ మొదటిసారి మల్హెరిన్‌తో కలిసి వచ్చారు.

ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) సృష్టికర్త ఓపెన్‌ఏఐ సంస్థ సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత ఏడాది ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. హై స్కూల్‌లో ఉన్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్‌ బహిర్గతం చేశారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్‌ సివోతో డేటింగ్‌ చేసి 2012లో విడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని