UPI Payments: మరింత విస్తరించనున్న యూపీఐ చెల్లింపుల పరిధి

ఆర్‌బీఐ యూపీఐ చెల్లింపుల పరిధిని మరింత విస్తరించే దిశగా నిర్ణయం తీసుకుంది. 

Published : 07 Dec 2022 18:48 IST

ముంబయి: కీలక వడ్డీరేట్ల పెంపుతో పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ బుధవారం మరో కీలక ప్రకటన చేశారు. ‘భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS)’, యూపీఐ (UPI) పరిధిని విస్తరించే ప్రణాళిక గురించి కూడా ప్రస్తావించారు. పన్ను చెల్లింపులు, అద్దె నుంచి పాఠశాల ఫీజుల వరకు ఏ రకమైన చెల్లింపునైనా చేయడానికి వినియోగదారులు త్వరలో BBPSని ఉపయోగించుకోవచ్చని శక్తికాంత దాస్‌ తెలిపారు. అన్ని రకాల చెల్లింపులు, వసూళ్లను చేర్చడానికి BBPS పరిధిని మెరుగుపరచనున్నట్లు దాస్‌ వెల్లడించారు. అలాగే వ్యక్తిగత వినియోగదారులతో పాటు విక్రేతలు కూడా దీన్ని ఉపయోగించుకునేలా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.

UPIలో ‘సింగిల్-బ్లాక్-అండ్-మల్టిపుల్ డెబిట్’ ఫంక్షనాలిటీని ప్రవేశపెట్టాలని RBI నిర్ణయించింది. దీంతో వినియోగదారులు ఇకపై తమ ఖాతాల్లోని నిధులను ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వేరుచేసి బ్లాక్‌ చేసి ఉంచగలుగుతారు. ఇది సెక్యూరిటీలలో పెట్టుబడులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌, హోటల్‌ బుకింగ్‌లకు సంబంధించిన చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుతం, యూపీఐ కస్టమర్‌లు మ్యూచువల్ ఫండ్ సిప్‌, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ మొదలైన ఓటీటీలు, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లు, డీటీహెచ్‌ మొదలైన వాటి చెల్లింపులు చేస్తున్నారు. ఇది యూపీఐ ఆటోపే సౌకర్యం ద్వారా సాధ్యపడుతోంది. ‘వర్చువల్ పేమెంట్‌ అడ్రస్‌’, QR కోడ్‌ ద్వారా ఇ-కామర్స్ చెల్లింపులు చేయడానికీ యూపీఐ ఉపయోగపడుతోంది.

నెలనెలా లేదా ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన పునరావృత చెల్లింపులు లేదా ఒకేసారి చేసే చెల్లింపుల కోసం ప్రస్తుతం కస్టమర్ బ్యాంక్ ఖాతాలోని నిధులను బ్లాక్‌ చేసే వ్యవస్థ అందుబాటులో ఉంది. దీన్ని కస్టమర్ నుంచి అనుమతి పొంది విక్రేతలు చేస్తుంటారు. అయితే, ఆర్‌బీఐ తాజాగా ప్రతిపాదించిన కొత్త మార్పు వల్ల ఒక్కసారి పొందిన అనుమతితో విక్రేతలు పలుసార్లు నిధులను కట్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే, నిధుల మొత్తంపై మాత్రం పరిమితి ఉంటుంది. ఉదాహరణకు మీరు హోటల్‌ని బుక్‌ చేసుకున్నారనుకుందాం. దానికి సంబంధించిన చెల్లింపును యూపీఐ ద్వారా చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటే మరోసారి యూపీఐ యాప్‌ను తెరిచి చెల్లింపునకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొత్త ఫంక్షనాలిటీ అందుబాటులోకి వస్తే.. మీ గడువు ముగిసిన తర్వాత కూడా హోటల్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా తర్వాతి చెల్లింపు జరిగిపోతుంది. అదే ఆన్‌లైన్‌ షాపింగ్‌ విషయానికి వస్తే.. కొంత మొత్తాన్ని మీరు ముందే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా బ్లాక్‌ చేసుకోవచ్చు. షాపింగ్‌ చేసిన ప్రతిసారి దాన్నుంచి డబ్బులు కట్‌ అవుతూ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ పేమెంట్‌ వ్యాలెట్స్‌ తరహాలోనే యూపీఐలోనూ కొత్త ఆప్షన్‌ రాబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని