Reliance: రిలయన్స్‌ @ ₹20 లక్షల కోట్లు.. తొలి భారత కంపెనీగా రికార్డు

Reliance stock: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అరుదైన ఘనత సాధించింది. రూ.20 లక్షల కోట్ల మార్కెట్ విలువ సాధించిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించింది.

Published : 13 Feb 2024 13:23 IST

Reliance Mcap | ముంబయి: ముకేశ్‌ అంబానీ (Mukesh ambani) నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance industries) మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. మార్కెట్‌ విలువ పరంగా తొలిసారి రూ.20 లక్షల కోట్లను దాటింది. ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు దాదాపు 14 శాతం మేర రాణించడంతో ఈ ఘనత రిలయన్స్‌ సొంతమైంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం రూ.2,904 వద్ద ముగిసింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 11.16 గంటలకు 1.8 శాతం మేర లాభంతో రూ.2,953 వద్ద ట్రేడయ్యింది. ఈ క్రమంలోనే  కంపెనీ మార్కెట్‌ విలువ రూ.20 లక్షల కోట్లు దాటింది. మధ్యాహ్నం ఒంటి సమయంలో 1.26 శాతం లాభంతో రూ.2941 వద్ద స్టాక్‌ ట్రేడవుతోంది. మార్కెట్‌ విలువ పరంగా రూ.15 లక్షల కోట్లతో టీసీఎస్‌ రెండో స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ రూ.10.5 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.7 లక్షల కోట్లు, ఇన్ఫీ రూ.7 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో అత్యధిక విలువ కంపెనీలుగా కొనసాగుతున్నాయి.

రారాజు రిలయన్స్‌

నెల రోజులు తిరగకుండానే రూ.లక్ష కోట్లు

చమురు నుంచి టెలికాం రంగం వరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వివిధ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2005లో ఈ కంపెనీ తొలిసారి రూ.1లక్ష కోట్ల మైలురాయిని అందుకుంది. 2007 ఏప్రిల్‌లో రూ.2 లక్షల కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.3 లక్షల కోట్లు, 2017 జులై నాటికి రూ.5 లక్షల కోట్ల మార్కును అందుకుంది. 2019 నవంబర్‌లో తొలిసారి రూ.10 లక్షల కోట్ల విలువను చేరుకున్న రిలయన్స్‌.. 2021 సెప్టెంబర్‌ నాటికి ఆ విలువ రూ.15 లక్షల కోట్లు దాటింది. కేవలం 600 రోజుల్లో రూ.5 లక్షల కోట్లు విలువ కూడదీసుకుని తాజాగా కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది జనవరి 29న కంపెనీ మార్కెట్‌ విలువ రూ.19 లక్షల కోట్లుగా ఉంది. అంటే నెల రోజులు తిరగక ముందే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ మరో రూ.లక్ష కోట్లు పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని