JFSL: అదానీ, కోల్‌ ఇండియాను దాటేసిన జియో ఫైనాన్షియల్‌!

JFSL Value: జియో ఫైనాన్షియల్‌ విలువను రూ.1.72 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. దీంతో మార్కెట్‌ విలువ పరంగా 32వ అతిపెద్ద సంస్థగా అవతరించింది.

Published : 20 Jul 2023 18:02 IST

దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (JFSL) ఆరంభంలోనే అదరగొట్టింది. 21 బిలియన్‌ డాలర్ల (రూ.1.72 లక్షల కోట్లు) విలువతో దేశంలోనే 32వ అతి విలువైన సంస్థగా నిలిచింది. త్వరలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్న ఈ కంపెనీ..  అప్పుడే మార్కెట్‌ విలువ పరంగా కొన్ని ప్రధాన కంపెనీల కంటే ముందు వరుసలో నిలిచింది.

ఆర్‌ఐఎల్‌ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను (జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌)ను విభజించేందుకు ఇవాళ  ప్రీ మార్కెట్‌ సెషన్‌ను నిర్వహించారు. ఇందులో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విలువను నిర్ధారించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్రితం రోజు ముగింపు విలువ.. ప్రత్యేక సెషన్‌లో వచ్చిన విలువ మధ్య వ్యత్యాసాన్ని ఈ స్థిర విలువగా నిర్థారించారు. దీంతో జియో ఫైనాన్షియల్‌ షేరు విలువ రూ.261.85గా లెక్కగట్టారు. అంతకుముందు దీని విలువ రూ.160 నుంచి రూ.190 వరకు ఉండొచ్చని వివిధ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి.

Infosys: ఇన్ఫీ లాభం 11 శాతం వృద్ధి.. భవిష్యత్‌ అంచనాల్లో కోత

కొత్తగా ఏర్పడిన జియో ఫైనాన్షియల్‌ మార్కెట్‌ విలువ రూ.1.72 లక్షల కోట్లుగా తేలింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీతో పాటు టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐఓసీ, బజాజ్‌ ఆటో వంటి ప్రముఖ కంపెనీల కంటే దీని విలువే అధికం కావడం గమనార్హం. త్వరలో జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అందుబాటులోకి రానుంది. అప్పటి వరకు ఈ షేరు విలువను రోజువారీ నిఫ్టీ సూచీ విలువ మదింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్స్ఛేంజీల్లో షేరు నమోదయ్యాక.. మూడు రోజుల పాటు నిఫ్టీ 50 సూచీలో 51వ కంపెనీ షేరుగా జియో ఫైనాన్షియల్‌ కొనసాగుతుంది.

రిలయన్స్‌ నుంచి విభజన అనంతరం ఐదో అతిపెద్ద ఫైనాన్షియర్‌గా జియో ఫైనాన్షియల్‌ అవతరించనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పేటీఎం, బజాజ్‌ ఫైనాన్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే రిలయన్స్‌కు దేశంలో విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉంది. సుమారు 42 కోట్ల మంది జియో వినియోగదారులతో పాటు, 17 వేల రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లు జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వృద్ధికి తోడ్పడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు