Samsung: శాంసంగ్ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌.. కొత్త వెర్షన్ ఫోల్డ్‌, ఫ్లిప్‌, ట్యాబ్, వాచ్‌ వచ్చేశాయ్‌!

Samsung Galaxy Unpacked Event: శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను దక్షిణ కొరియాలో నిర్వహించింది. ఇందులో నాలుగు కొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది.

Published : 27 Jul 2023 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ కంపెనీలు నిర్వహించే ఈవెంట్లలో యాపిల్‌ తర్వాత శాంసంగ్‌ కంపెనీ నిర్వహించే అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌పై ఎంతో మంది ఆసక్తి కనబరుస్తారు. తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను దక్షిణ కొరియాలో నిర్వహించింది. ఇందులో నాలుగు కొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. వీటిలో శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 (Samsung Galaxy Z Fold 5), గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 (Samsung Galaxy Z Flip 5), గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌9 (Samsung Galaxy Tab S9)తోపాటు వాచ్‌ 6 (Samsung Galaxy Watch 6), ఇయర్‌బడ్స్‌ ఉన్నాయి. మరి, ఈ డివైజ్‌లలో ఉన్న కొత్త ఫీచర్లు ఏమేం ఉన్నాయో చూద్దాం. 


శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్ 5

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ 5.1.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్‌ వెలుపల (మడతపెట్టినప్పుడు) 6.2-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌ తెరిచినప్పుడు 7.2-అంగుళాల క్యూఎక్స్‌జీఏ + డైనమిక్‌ అమోలెడ్‌ 2 ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్సీ డిస్‌ప్లే ఉంది. ఈ రెండు డిస్‌ప్లేల రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌. 

ఈ ఫోన్‌లో ఐదు కెమెరాలున్నాయి. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 12 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 10 ఎంపీ టెలీఫొటో కెమెరాలను అమర్చారు. ఫోన్‌ మడబెట్టినప్పుడు 10 ఎంపీ కవర్‌ డిస్‌ప్లే కెమెరా, ఫోన్‌ లోపల 4 ఎంపీ అండర్‌ డిస్‌ప్లే కెమెరా ఇస్తున్నారు. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్‌ అడాప్టర్‌తో 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. 

గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 5 మూడు స్టోరేజ్‌ వేరియంట్లో తీసుకొచ్చారు. 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ/512 జీబీ, 12 జీబీ/ 1టీబీ. ఈ మోడల్ ప్రారంభ 1,799 డాలర్లు (సుమారు రూ. 1.47 లక్షలు)గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 11 నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు ఎంపిక చేసిన మార్కెట్లో ప్రారంభంకానున్నాయి. 


శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5

గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌ 5లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ 5.1.1 ఓఎస్‌తో ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్‌ వెలుపలి భాగాన్ని అల్యూమినియం ఫ్రేమ్‌తో డిజైన్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసినప్పుడు 6.7-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్ వెలుపల 3.4-అంగుళాల సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. గత ఫ్లిప్‌ మోడల్‌లో వెలుపల 1.9-అంగుళాల డిస్‌ప్లే మాత్రమే ఉండేది. దానితో పోలిస్తే ఫ్లిప్ 5 సిరీస్‌లో వెలుపలి డిస్‌ప్లే సైజ్‌ను రెండింతలు పెంచారు. 

ఇందులో మొత్తం మూడు కెమెరాలున్నాయి. ఫోన్ వెలుపల రెండు 12 ఎంపీ కెమెరాలతోపాటు, ముందు 10 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ  ఫోన్‌ ప్రారంభ ధర 999 డాలర్లు (సుమారుగా రూ. 82 వేలు)గా కంపెనీ నిర్ణయించింది. 


శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్9

గెలాక్సీ ట్యాబ్ ఎస్‌9ను మూడు వేరియంట్లలో పరిచయం చేసింది. ఎస్‌9, ఎస్‌9+, ఎస్‌9 అల్ట్రా. ఈ మూడు వేరియంట్లు  ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ ట్యాబ్‌ ఓఎస్‌తో పనిచేస్తాయి.  వీటిలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మూడింటిలోనూ ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ఉంది. ఈ ట్యాబ్‌లను 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ/256 జీబీ, 12 జీబీ/ 512 జీబీ, 16 జీబీ/ 1 టీబీ వేరియంట్లలో తీసుకొచ్చారు. 

  • ఎస్‌9లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 11-అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్ డిస్‌ప్లే ఇస్తున్నారు.  ఇందులో వెనుకవైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, ముందు భాగంలో వీడియో కాలింగ్‌, సెల్ఫీల కోసం 12 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరాలను అమర్చారు. 8,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. డాల్బీ అట్‌మోస్‌తో క్వాడ్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు.  ఇందులో డెక్స్ మోడ్‌ కూడా ఉంది. దీంతో యూజర్లు డిస్‌ప్లేతో ఒకేసారి రెండు స్క్రీన్లను చూడొచ్చు. 
  • ఎస్‌9+లో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 12.4-అంగుళాల అమోలెడ్‌ 2ఎక్స్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా ఇస్తున్నారు. ముందుభాగంలో 12 ఎంపీ వైడ్‌, అల్ట్రావైడ్‌ కెమెరా అమర్చారు. 10,090 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 
  • ఎస్‌9 అల్ట్రాలో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 14.6-అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 13 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 12 ఎంపీ కెమెరా అమర్చారు. 11,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 6 

గెలాక్సీ వాచ్ 6 రెండు వేరియంట్లలో పరిచయం చేశారు. గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్‌ 6 క్లాసిక్. వీటిలో సఫైర్ క్రిస్టల్‌ అమోలెడ్‌ ఆల్వేస్-ఆన్‌-డిస్‌ప్లే (AOD) ఇస్తున్నారు. రెండు వాచ్‌లు ఎక్సినోస్ డబ్ల్యూ930 ప్రాసెసర్‌, గూగుల్ వేర్‌ ఓఎస్‌ ఆధారిత వన్‌యూఐ 5 వాచ్‌ ఓఎస్‌తో పనిచేస్తాయి. 

గెలాక్సీ వాచ్‌ 6లో 40 ఎమ్‌ఎమ్‌ డయల్‌లో 1.3 అంగుళాల స్క్రీన్‌, 44 ఎమ్‌ఎమ్‌ డయల్‌తో 1.5-అంగుళాల స్క్రీన్‌ ఇస్తున్నారు. గెలాక్సీ వాచ్‌ 6 క్లాసిక్‌ మోడల్‌లో 43 ఎమ్‌ఎమ్‌ డయల్‌తో 1.3-అంగుళాల స్క్రీన్‌, 47 ఎమ్‌ఎమ్‌ డయల్‌తో 1.5-అంగుళాల స్క్రీన్‌ అమర్చారు. రెండు వేరియంట్లలో 300 ఎంఏహెచ్, 400 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏఓడీ మోడ్‌లో 30 నుంచి 40 గంటల పాటు పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. 

ఈ వాచ్‌లలో హార్ట్‌రేట్‌, ఆక్సిజన్‌, స్లీప్‌ మానిటరింగ్ ఫీచర్లతోపాటు, స్లీప్‌ కోచింగ్‌, ఫిట్‌నెస్‌ కోచింగ్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. హార్ట్‌రేట్‌ రిథమ్‌లో మార్పులను పసిగట్టి యూజర్‌ను అప్రమత్తం చేసేందుకు ఈ వాచ్‌లలో కొత్తగా ఏఎఫ్ఐబీ మానిటరింగ్ ఫీచర్‌ ఇస్తున్నారు. ఇవేకాకుండా బ్లడ్‌ ప్రెజర్‌ మానిటరింగ్, ఆడవారిలో రుతుక్రమాన్ని ముందస్తుగా అంచనా వేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని