SpiceJet: స్పైస్‌జెట్‌లో 15 శాతం ఉద్యోగుల తొలగింపు?

SpiceJet: స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం 9,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 15 శాతం మందిని తీసివేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు సమాచారం.

Published : 12 Feb 2024 14:40 IST

SpiceJet | దిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ (SpiceJet) ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. దాదాపు 1,350 మందిని తీసివేయనున్నట్లు సమాచారం. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందిలో ఇది 15 శాతానికి సమానం. వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది వేతనాలు భారంగా మారాయని.. గతకొన్ని నెలలుగా వాటి చెల్లింపుల్లోనూ ఆలస్యమవుతోందని సమాచారం. జనవరి నెల వేతనం ఇప్పటికీ కొంతమందికి అందలేదని తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

స్పైస్‌జెట్‌లో (SpiceJet) ప్రస్తుతం 9,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 10-15 శాతం మందిని తొలగించే యోచనలో కంపెనీ ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి వెల్లడించారు. దీనిపై ఈవారం జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న విమానాలతో పోలిస్తే సిబ్బంది సంఖ్య అదనంగా ఉందని చెప్పారు. వీరిని తొలగించటం వల్ల సంస్థకు ఏటా రూ.100 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.

ఉద్యోగుల తొలగింపుల నిమిత్తం ఇప్పటికే ఆయా విభాగాలకు సమాచారం అందించిన స్పైస్‌జెట్‌ వారి వివరాలు తెప్పించుకుందని మరో అధికారి వెల్లడించారు. ‘రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ (RCS)’ కింద ఉన్న కొన్ని మార్గాల్లో కంపెనీ సేవలను నిలిపివేసిందని.. అక్కడ ఉన్న సిబ్బందిని బదిలీ చేయటం సాధ్యం కావటం లేదని తెలిపారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌ (SpiceJet) 40 విమానాలను నడుపుతోంది. వీటిలో పదింటిని లీజు కింద తీసుకుంది. నిధులను పొదుపుగా వాడుకోవాలని.. ఖర్చులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సంస్థ ఛైర్మన్‌, ఎండీ అజయ్‌సింగ్‌ గతనెల సీనియర్‌ అధికారులతో జరిపిన సమావేశంలో నొక్కి చెప్పారు.

ఆర్థిక కష్టాలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌ (SpiceJet) నిధుల సమీకరణ పనిలో పడింది. ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌ కింద సెక్యూరిటీలను జారీ చేసి రూ.2,250 కోట్లు సమీకరించనున్నట్లు గతంలో తెలిపింది. అందులో భాగంగా జనవరి 26న రూ.744 కోట్లు అందుకున్నట్లు వెల్లడించింది. మిగిలిన వాటి సమీకరణలో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అత్యవసర క్రెడిట్‌లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ కింద రూ.1,000 కోట్లు అందుకుంది. అజయ్‌ సింగ్‌ స్వయంగా మరో రూ.500 కోట్లు చొప్పిస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ కంపెనీకి విమానాలను లీజుకిచ్చినవారు తమ బకాయిలను చెల్లించటం లేదంటూ ఇటీవల కోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని