TATA Sons IPO: అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్‌ నుంచే!

TATA Sons: టాటా సన్స్‌ను ఆర్‌బీఐ సెప్టెంబర్‌ 14న ‘అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా’ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం ఈ కేటగిరీలో చేరిన కంపెనీలు మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్‌లలో లిస్ట్‌ కావాల్సి ఉంటుంది.

Updated : 25 Sep 2023 16:30 IST

TATA Sons IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: టాటా గ్రూప్‌ మాతృసంస్థ టాటా సన్స్‌ త్వరలో ఐపీఓ (TATA Sons IPO)కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పటి వరకు భారత్‌లో ఇదే అతిపెద్ద ఐపీఓ అవ్వొచ్చని అంచనా. రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) ఇటీవల టాటా సన్స్‌ను ‘అప్పర్‌ లేయర్‌ నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ’గా వర్గీకరించింది. నిబంధనల ప్రకారం.. ఈ కేటగిరీలోకి వచ్చిన కంపెనీ.. మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ కావాల్సి ఉంటుంది.

టాటా సన్స్‌ను ఆర్‌బీఐ సెప్టెంబర్‌ 14న ‘అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా’ వర్గీకరించింది. నిబంధనల ప్రకారం మూడేళ్లలో అంటే 2025 సెప్టెంబర్‌ 14 నాటికి ఈ కంపెనీ ఐపీఓ (TATA Sons IPO) ప్రక్రియ పూర్తి చేసుకొని స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కావాలి. మరో టాటా గ్రూప్‌ కంపెనీ టాటా క్యాపిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కూడా అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీగా వర్గీకరణ పొందింది. కానీ, ఇది టాటా సన్స్‌లో విలీనం కానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఐపీఓకి రావాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ కేటగిరీలో చేరిన కంపెనీలపై నియంత్రణా చర్యలు పటిష్ఠంగా ఉంటాయి.

టాటా సన్స్‌ ప్రస్తుత విలువ రూ.11 లక్షల కోట్లని అంచనా! ఒకవేళ దీంట్లో ఐదు శాతం వాటాలను విక్రయించాలనుకుంటే.. అప్పుడు ఐపీఓ పరిమాణం రూ.55,000 కోట్లు అవుతుంది. ఇదే జరిగితే భారత్‌లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తుంది. ప్రస్తుతానికి రూ.21,000 కోట్లు సమీకరించిన ఎల్‌ఐసీ ఐపీఓనే అతిపెద్దది.

మరో మార్గమూ ఉంది..

అయితే, ఐపీఓకి రావడం కాకుండా టాటా సన్స్‌కు మరో మార్గం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐపీఓకి రావొద్దనుకుంటే కంపెనీని పునర్‌వ్యవస్థీకరించడం వల్ల ఆర్‌బీఐ నిబంధనల నుంచి మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే, టాటా సన్స్‌ విషయంలో అలా జరగకపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. మార్కెట్‌లోని పరిస్థితులు, ఆయా రంగాల పనితీరును చూసుకొని టాటా సన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ (TATA Sons IPO)కి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని