TCS: టీసీఎస్‌ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్‌’కు గుడ్‌బై..!

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులంతా వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు రావాల్సిందేనని సూచించింది.

Updated : 30 Sep 2023 07:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) హైబ్రిడ్‌ వర్కింగ్ పాలసీకి గుడ్‌బై చెప్పింది. అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చిందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. వచ్చే నెల నుంచి వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని కంపెనీ పేర్కొంది. ఇతర కంపెనీలూ టీసీఎస్‌ను అనుసరించే అవకాశం ఉంది.

కరోనా సమయంలో మొదలైన పూర్తి వర్క్‌ఫ్రమ్‌ అనంతరం.. ఈ హైబ్రిడ్‌ వర్క్‌ సంస్కృతి మొదలైంది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి మిగిలిన రెండ్రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ పేరిట ఉద్యోగులు ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఇ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఆయా డివిజన్ల మేనేజర్లు సూచిస్తున్నారు.

అమెజాన్‌ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..

ఉద్యోగులంతా కార్యాలయాలకు రావడం ఎంత అవసరమో కంపెనీ 2022-23 వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కంపెనీలో పనిచేస్తున్న వారిలో సగం మంది ఉద్యోగులు 2020 మార్చి తర్వాత నియమితులైన వారేనని అందులో ప్రస్తావించింది. వీరంతా సీనియర్లు, లీమ్‌ లీడర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, వారి నడవడిక, ఆలోచనా తీరు నుంచి కొత్త వారు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని పేర్కొంది. ఉద్యోగులు పరస్పరం చర్చించుకోకుండా అభివృద్ధి సాధ్యం కాదని, కాబట్టి ఈ ఏడాదిలోనే దశలవారీగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడింది. ఇందులో భాగంగా టీసీఎస్‌ తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని