Sudha Murthy: నారాయణమూర్తి హీరోలా ఉంటాడనుకున్నా: సుధామూర్తి

పెళ్లికి ముందు తన భర్త నారాయణ మూర్తి(Narayana Murthy)ని తొలిసారి చూసినప్పుడు ‘ఎవరీ చిన్నపిల్లాడు?’ అని అనుకున్నట్లు తెలిపారు ఆయన సతీమణి సుధామూర్తి (Sudha Murthy). ఓ టెలివిజన్‌ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.

Updated : 10 May 2023 12:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy)తో తన తొలి పరిచయం ఎలా జరిగిందో బయటపెట్టారు ఆయన సతీమణి, రచయిత్రి సుధామూర్తి (Sudha Murthy). ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని తాను ఊహించుకున్నట్లు తెలిపారు. బాలీవుడ్‌లో ప్రముఖ టాక్‌షో ‘ది కపిల్‌ శర్మ షో’లో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, నిర్మాత గునీత్ మోంగాతో కలిసి సుధామూర్తి ఈ షో (The Kapil Sharma Show)లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో ఇన్ఫీ (Infosys) సహ వ్యవస్థాపకుడిని తొలిసారి ఎప్పుడు కలిశారని హోస్ట్‌ కపిల్ శర్మ.. సుధామూర్తి (Sudha Murthy)ని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ ఓ స్నేహితురాలి ద్వారా నారాయణమూర్తి పరిచయమైనట్లు చెప్పారు.

ఇదీ చదవండి: నా కుమార్తె వల్లే రిషిసునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయ్యారు: సుధామూర్తి

‘‘నాకు ప్రసన్న అని ఓ స్నేహితురాలు ఉండేది. ఆమె ప్రతి రోజు ఓ పుస్తకం తీసుకొచ్చేది. అందులో తొలి పేజీపై నారాయణ మూర్తి పేరుతో పాటు పలు ప్రదేశాల పేర్లు ఉండేవి. మూర్తి పేరు పక్కన ఇస్తాంబుల్‌, పెషావర్‌ ఇలాంటి పేర్లు కన్పించేవి. దాన్ని చూసి నేను.. నారాయణమూర్తి అంతర్జాతీయ బస్‌ కండెక్టరా? అని అనుకునేదాన్ని. ఓ రోజు ఆయనను కలిసేందుకు వెళ్లా. మూర్తిని చూడకముందు ఆయన ఓ సినిమా హీరోలా అందంగా ఉంటారని అనుకున్నారు. కానీ, డోర్‌ తెరవగానే ఆయన్ను చూసి ‘ఎవరీ చిన్న పిల్లాడు?’ అని అనిపించింది’’ అని సుధామూర్తి (Sudha Murthy) నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు. ఇది వినగానే రవీనా టాండన్‌, కపిల్‌, గునీత్‌తో సహా అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. పూర్తి ఎపిసోడ్‌ ఈ వారాంతంలో ప్రసారం కానుంది.

నారాయణమూర్తి సతీమణిగానే గాక.. రచయిత్రి, విద్యావేత్త, వితరణశీలిగా సుధామూర్తి సుపరిచితురాలు. 44 ఏళ్ల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె అక్షతా (యూకే ప్రధాని రిషి సునాక్‌ సతీమణి), కుమారుడు రోహన్‌ ఉన్నారు. సుధామూర్తి సేవలకు గానూ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని