Budget 2023: బుల్‌పై ‘మార్కెట్లో’ ఆశలు..!

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్టాక్‌ మార్కెట్‌లో లావాదేవీలపై మన దేశంలో పన్నులు ఉన్నాయి. వీటిని తొలగిస్తే మార్కెట్‌లో ట్రేడింగ్‌, పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. 

Published : 22 Jan 2023 09:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికాలో ద్రవ్యోల్బణం, చైనాలో కొవిడ్‌ భయాలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేశాయి. ఆ ప్రభావం భారతీయ కంపెనీలపై కూడా పడింది. అయినా కానీ, దేశీయ స్టాక్‌మార్కెట్లు(stock market) కొంత ప్రీమియంలోనే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మాంద్యం భయాలు ఉండటంతో మార్కెట్‌ ఈ ఏడాది సున్నితంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌(Budget 2023)లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్ణయాలు 2023-24లో కోట్ల మంది మదుపర్ల ప్రయోజనాలను ప్రభావితం చేయనున్నాయి.

భారత్‌లో కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి సమయంలో స్టాక్‌ మార్కెట్‌ పునాదులు బలపడ్డాయి. అదెలా అంటారా..? కొవిడ్‌ వ్యాప్తికి ముందు మార్చి 2020 నాటికి భారత్‌లో 4.9 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు ఉండగా.. కొవిడ్‌ తర్వాత 2022 నవంబర్‌ నాటికి అవి 10.4 కోట్లకు చేరాయి. అంటే రెండేళ్లలో 100 శాతానికి పైగా పెరిగాయి. దీంతో మార్కెట్లలో పెట్టుబడులపై మధ్య తరగతి వర్గాల్లో ఆసక్తి పెరిగిందనే విషయాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. ఇక పెట్టుబడుల రూపంలో భారత్‌కు వచ్చే విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఇవి ప్రభావితం చేస్తాయి.

ఎల్‌టీసీజీలో మార్పులు..

భారత్‌లో పెట్టుబడులను మరింత ఆకర్షణీయంగా మార్చాలంటే ఇప్పటికే ఉన్న ఎల్‌టీసీజీ(దీర్ఘకాలి మూలధన లాభాల) పన్నును తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల్లో ఏడాది దాటిన వాటి విక్రయాల్లో లక్ష కంటే ఎక్కువ లాభం వస్తే 10శాతం పన్ను విధిస్తున్నారు. పన్ను విధించే లాభాల పరిధిని పెంచితే ఇన్వెస్టర్ల చేతికి మరిన్ని నిధులు లభించే అవకాశం ఉంటుంది.

* ఇక మూడేళ్లపాటు కొనసాగించిన పెట్టుబడిపై ఎల్‌టీసీజీ(LTCG) పూర్తిగా తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని రకాల మూలధన లాభాలపై ఒకే విధమైన పన్ను విధానం ఉంటే అది పన్ను చెల్లింపు దారులకు మరిన్ని నిధులను అందుబాటులోకి తెస్తుంది. వాటిని పెట్టుబడుల రూపంలో వారు ఉపయోగించే అవకాశం ఉందన్నది వారి వాదన.

ఎస్‌టీటీ తొలగించాలి..

సెక్యూరిటీల బదలాయింపు పన్ను(ఎస్‌టీటీ), కమోడిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(సీటీటీ)ని రద్దు చేయాలని కొన్నేళ్లుగా ది అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్స్‌ఛేంజి మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎన్‌ఎంఐ) ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రపంచంలో సీటీటీ, ఎస్‌టీటీపై పన్ను విధిస్తున్న ఏకైక దేశం భారత్‌ మాత్రమే. 2014లో ఎస్‌టీటీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పన్ను ఆదాయంలో స్టాక్స్, ఈక్విటీపై వచ్చే మొత్తం కేవలం 2శాతం మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు పన్నులపై రిబేట్‌ విధానాన్ని అమలు చేస్తే మార్కెట్‌లో కార్యకలపాలు మరింత చురుగ్గా జరిగే అవకాశం ఉంది.

క్రిప్టోలపై మరింత స్పష్టత..

భారత్‌లో జరిగే ప్రధాన స్పెక్యూలేషన్‌లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ కూడా అధికంగానే ఉంది. దేశంలో సుమారు 1.5 కోట్ల మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఉండగా.. ఈ రంగంలో 350 వరకు స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. గతేడాది క్రిప్టో లావాదేవీలపై 30శాతం వరకు పన్ను విధిస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. మరోవైపు ఆర్‌బీఐలో కీలక అధికారులు మాత్రం క్రిప్టోలు నిషేధించాలని బలంగా కోరుతున్నారు. గతేడాది బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన కొద్ది రోజులకే ఆర్‌బీఐ డిప్యూటి గవర్నర్‌ టి.రబి శంకర్‌ మాట్లాడుతూ ‘‘క్రిప్టోలను బ్యాన్‌ చేయడమే భారత్‌కు సూచించదగిన అత్యుత్తమ మార్గం’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు కొద్ది రోజుల క్రితమే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కూడా వీటిని నిషేధించాలని కోరారు. ద్రవ్య పరపతి సమీక్షలకు అతీతమైన స్థితికి ఇవి చేరుకొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని