Vistara Airlines: విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బందికి కొత్త చిక్కులు!

సరఫరా వ్యవస్థలో తలెత్తిన సమస్య కారణంగా విస్తారా ఎయిర్‌లైన్స్ (Vistara Airlines) సిబ్బంది గతంలో ఏ విమానయాన సంస్థ ఎదుర్కొని కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, దీన్ని త్వరలోనే పరిష్కరిస్తామని విస్తారా సంస్థ తెలిపింది.

Published : 09 Jun 2023 21:09 IST

దిల్లీ: విస్తారా ఎయిర్‌లైన్స్‌ (Vistara Airlines) సిబ్బందికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సరఫరా వ్యవస్థలో సమస్య కారణంగా విస్తారా విమానాల్లో సేవలందించే క్యాబిన్‌ సిబ్బందికి యూనిఫామ్‌ల కొరత ఏర్పడింది. దీంతో తమ సిబ్బంది కొద్దిరోజులు వంకాయ రంగు దుస్తులకు బదులు, నల్లటి దుస్తుల్లో సేవలందిస్తారని, ఇందుకు ప్రయాణికులు సహకరించాలని విస్తారా సంస్థ ట్వీట్‌లో పేర్కొంది. 

‘‘మా సంస్థ సర్వీసులను విస్తరించడంలో భాగంగా సిబ్బంది సంఖ్యను కూడా పెంచాం. అయితే, డిమాండ్‌కు తగిని సరఫరా లేని కారణంగా మా క్యాబిన్‌ సిబ్బందికి యూనిఫామ్‌ల కొరత ఏర్పడింది. కానీ, విమాన సర్వీసుల ద్వారా ప్రయాణికులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో యూనిఫామ్‌ లేకున్నా సిబ్బందిని విధులకు హాజరుకావాలని సూచించాం. ఇందులో భాగంగా కొద్ది రోజుల పాటు మా సిబ్బంది బ్లాక్‌ ప్యాంట్‌, విస్తారా లోగో ఉన్న పోలో టీ-షర్ట్‌లు ధరించి సేవలందిస్తారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ముగింపు పలుకుతాం’’ అని విస్తారా సంస్థ ట్వీట్‌ చేసింది. 

గతంలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (Singapore Arlines)తో కలిసి టాటా గ్రూప్‌ ( Tata Group) నిర్వహించింది. ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దాలని టాటా గ్రూప్‌ భావించింది. ఇందులో భాగంగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను గతేడాది ఎయిరిండియాలో విలీనం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని