logo

కలవరపెడుతున్న కడెం

సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో నిర్మల్‌ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు చేరుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆరురోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. ఎగువన ఉన్న బోథ్‌ ప్రాంతం నుంచి మంగళవారం....

Updated : 14 Jul 2022 09:52 IST

భారీగా ప్రవాహం.. ప్రమాదపుటంచున జలాశయం

ఈటీవీ- ఆదిలాబాద్‌


కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఉరకలేస్తున్న నీరు

సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో నిర్మల్‌ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు చేరుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆరురోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. ఎగువన ఉన్న బోథ్‌ ప్రాంతం నుంచి మంగళవారం సాయంత్రం నుంచి భారీగా వరదరావడంతో అర్ధరాత్రికి కడెం జలాశయం నీటిసామర్థ్యం 700 అడుగులకు చేరుకుంది. అప్రమత్తమైన యంత్రాంగం రాత్రికి రాత్రే ప్రమాదపు సైరన్‌ మోగించింది. పక్కనే ఉన్న పాత కడెం గ్రామాన్ని ఖాళీ చేయించింది. జలాశయం దిగువన ఉన్న కన్నాపూర్‌, కొందుకూరు, పాండవాపూర్‌, అంబారీపేట, బెల్లాల్‌, మున్యాల, రాంపూర్‌, బూత్కూరు,దేవునిగూడెం, గొడిసిర్యాల్‌ గ్రామాల ప్రజలను ఆగమేఘాలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉద్ధృతి మరింత పెరగడంతో ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో 17గేట్లను ఎత్తివేయగా, సాంకేతిక లోపం కారణంగా మరో గేటు తెరుచుకోలేదు. వాస్తవంగా కడెం ప్రాజెక్టులోకి సెకనుకు 2.95లక్షల క్యూసెక్కుల వచ్చే నీటి సామర్థ్యాన్ని తట్టుకునే వెసలుబాటు ఉంది. కానీ రాత్రి దాదాపుగా 5 లక్షల క్యూసెక్కుల నీరురావడం, బయటకు వెళ్లే నీరు దాదాపుగా 3 లక్షల క్యూసెక్కులకే పరిమితం కావడంతో ప్రమాద భరితంగా మారింది. ఓ దశలో చేతులెత్తేసిన అధికారయంత్రాంగం ప్రకృతిపై ఆధారపడాల్సి వచ్చింది.


కడెం ప్రాజెక్టు నుంచి పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా దీనిపై ఆరా తీశారు. నిర్మల్‌లో ఉన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా ఎమ్మెల్యే రేఖానాయక్‌, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ కడెం చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. 18వ గేటు పక్కన ఉన్న ప్రధాన కాలువకు బుంగపడటంతో భారీగా వరద బయటకు వెళుతోంది. కడెం జలాశయానికి బుధవారం సాయంత్రం మరోసారి వరద పోటెత్తింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతలో 3 లక్షల క్యూసెక్కులకు పడిపోయిన ఇన్‌ఫ్లో సాయంత్రం తరువాత క్రమంగా మళ్లీ పెరిగింది. దాదాపుగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మరోసారి 5 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో జలాశయానికి కుడిపక్కన ఉన్న కట్టకు ఓ చోట బుంగపడింది. దాన్ని ఆనుకొని ఉన్న హరిత హోటల్‌, నివాసిత ప్రాంతం, రహదారిపై నుంచి కడెం ఊళ్లోకి సైతం వరద వచ్చింది. దాదాపుగా 120 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్వాసితులను కడెంలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఐబీ, ఆసుపత్రికి తరలించి పునరావాసం కల్పించారు. సాగునీటి శాఖ ఎస్‌ఈ సుశీల్‌కుమార్‌, ఈఈ రాజశేఖర్‌, నిర్మల్‌ ఆర్డీవో తుకారాం, కడెం, దస్తూరాబాద్‌ తహసీల్దార్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాత్రివరకు వరద ఉద్ధృతి మరింత పెరిగితే ప్రాజెక్టు మళ్లీ ప్రమాదపుటంచుకు చేరుకునే అవకాశం ఉందనే అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.

నీట మునిగిన కడెం మండల కేంద్రం

కడెం చరిత్రలో మూడోసారి..

కడెం చరిత్రలో ఇలాంటి వరద రావడం ఇది మూడోసారి. కడెం జలాశయం తొలుత 9గేట్లతో నిర్మితమైంది. నిర్మించిన తర్వాత కొద్దికాలానికే 1959లో భారీగా వరదరావడంతో ఆనకట్టకు ముప్పువాటిల్లడంతో అప్పటి ప్రభుత్వం 1959లో 18 గేట్లతో పునర్ణిర్మాణ పనులను చేపట్టి 1962వరకు పూర్తిచేసింది. 1995లో మళ్లీ భారీగా వరద వచ్చింది. భారీగా వచ్చిన ఉద్ధృతి కారణంగా ప్రాజెక్టుకు ఇరువైపులా ఆనకట్ట కోతకు గురికావడంతో మరోసారి ప్రమాదం తప్పింది. తాజాగా వరదతో ప్రాజెక్టు నిర్వహణ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపుగా కడెం నుంచి మంచిర్యాల వరకు దాదాపుగా 60వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. కడెంలో సెకనుకు 2.85లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే సామర్థ్యం ఉంటే తాజాగా 5లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండడంతో ప్రమాదానికి కారణమైందని అధికారులు తెలిపారు.

నిర్వహణే కీలకం..

గతానికంటే భిన్నంగా ఏడాది కిందట అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌(ఓఅండ్‌ఎం) విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఓ ఈఎన్‌సీ నేతృత్వంలో ఇద్దరు సీఈలు, ఎస్‌ఈలు, ఈఈ, డీఈ, జేఈలతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేసింది. దానికోసం కొంత బడ్జెట్‌ను సైతం కేటాయించింది దీని ప్రకారం వర్షాకాలం ఆరంభంకంటే ముందే ప్రాజెక్టు పనితీరు, గేట్ల నిర్వహణ, సాంకేతిక అంశాలు, వరద ఉప్పొంగితే దిగువన ఉత్పన్నమయ్యే అంశాలను ఆరాతీయాల్సి ఉంది. దానికనుగుణంగా ప్రాజెక్టులవారీగా మరమ్మతులు చేపట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. వర్షాకాలంలోనైతే ప్రత్యేకంగా డీఈ, జేఈలతోపాటు అవసరమైతే అత్యవసర సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ కడెంలో తగినంత సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ అనుకున్నంత మేరకు జరగడంలేదు. తొలుత గేట్లను నిర్వహణ చేసినపుడు ఒక గేటును మరమ్మతులే చేయడం కుదరకపోవడంతో అది తెరుచుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని