logo

బరువును మించి.. బడి సంచి..!

మేదరిపేటకు చెందిన అన్వేష్‌ స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నాడు. నిత్యం అధిక బరువున్న బ్యాగు వేసుకొని బడికి నడుచుకుంటూ వెళ్లేవాడు. మొదట్లో నడుము నొప్పి రాగా సాధారణంగా భావించి తల్లిదండ్రులు పట్టించుకోలేదు. తరచూ

Updated : 01 Aug 2022 06:53 IST

విద్యార్థులకు తప్పని తిప్పలు.. అమలు కాని నో బ్యాగ్‌ డే

మేదరిపేటకు చెందిన అన్వేష్‌ స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నాడు. నిత్యం అధిక బరువున్న బ్యాగు వేసుకొని బడికి నడుచుకుంటూ వెళ్లేవాడు. మొదట్లో నడుము నొప్పి రాగా సాధారణంగా భావించి తల్లిదండ్రులు పట్టించుకోలేదు. తరచూ వేధిస్తుండటంతో వైద్యుడిని సంప్రదించగా..అధిక పుస్తకాల బరువుతోనే ఈ సమస్య వచ్చిందని తెలపడంతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులే ద్విచక్ర వాహనంపై దించుతున్నారు. ఇది ఒక్క అన్వేష్‌ సమస్య కాదు దాదాపు ప్రస్తుత విద్యారులందరిదీ..ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

దండేపల్లి గ్రామీణం, మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే : ఉదయం ఎనిమిది అయిందంటే.. విద్యార్థులు భుజాలకు బడి సంచులు వేసుకొని భారంగా నడవటం చూస్తుంటాం. మెడ వంగిపోతుందా.. అనేంత బరువుంటుందా సంచి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే బ్యాగు బరువు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. శక్తికి మించి బరువుండే పుస్తకాల సంచిని మెడలో వేసుకొని వెళ్తూ నానా అవస్థలు పడతుంటారు. పిల్లల శరీర బరువులో బ్యాగు బరువు 10 శాతం మించొద్దనే విషయమై విద్యావేత్తలు అనేక సార్లు సూచించినా, ప్రభుత్వాలు నియమించిన విద్యా కమిటీలు ఆ మేరకు ప్రతిపాదనలు చేసినా ఆచరణ కొరవడింది. ఏటా పాఠశాలల ప్రారంభంలో కొద్ది రోజులు దీనిపై చర్చ జరగడం తప్ప నిర్దిష్ట ప్రయత్నాలు జరగడం లేదని విద్యా నిపుణులు, పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఆదేశాలున్నా.. ఆచరణ కరవు

జాతీయ విద్యా ప్రణాళిక -2005, స్కూల్‌ బ్యాగు 2020 విధానంలో పుస్తకాల సంచిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నెలలో ఒకరోజు పుస్తకాల సంచి నుంచి విముక్తి (నో బ్యాగు డే) కల్పించాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ ఈసారి నో బ్యాగు డేను ఆమోదించింది. ప్రతి నెల మూడో శనివారం అమలు చేయాలని నిర్ణయించింది. కాని చాలా పాఠశాలల్లో ఇది అమలు కావడం లేదు. విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుంటేనే సంచి మోత నుంచి విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

రాష్ట్రాల్లో విభిన్నంగా...

ఆయా రాష్ట్రాలు దశల వారీగా దీన్ని పాటిస్తున్నాయి. ఏపీలో మొదటి, మూడో శనివారాల్లో ‘సృజన-శనివారం సందడి’ పేరుతో జరుపుతున్నారు. తమిళనాడులో ఫిబ్రవరి 26న పుస్తక దినోత్సవాన్ని నో బ్యాగు డే నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మణిపూర్‌, రాజస్థాన్‌లోనూ ఒక శనివారం విద్యార్థులు పుస్తకాలను దూరంగా ఉండేలా ప్రకటించారు.

నాడీ వ్యవస్థపై ప్రభావం

చిన్న పిల్లలపై అధిక బరువు పడితే భవిష్యత్తులో నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. మెడ, నడుపు, భుజాల నొప్పులు వస్తాయి. బ్యాగు ఒకవైపు వేసుకోవడంతో కండరాల నొప్పి, ఛాతి మీద ఒత్తిడి పెరుగుతుంది. పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలను పాఠశాలల్లోనే పెట్టేందుకు ర్యాక్స్‌ ఏర్పాటు చేయాలి. అవసరమైన ఇంటిపనికి సంబంధించి పుస్తకాలు మాత్రమే తీసుకొస్తే బరువు బాధ తగ్గుతుంది. - అరుణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, దండేపల్లి

ఉమ్మడి జిల్లా వివరాలు..

ఉన్నత పాఠశాలలు 385

ప్రాథమిక  పాఠశాలలు 2271

ప్రాథమికోన్నత పాఠశాలలు 383

విద్యార్థులు 2,18,268

ప్రైవేట్‌ పాఠశాలలు 1016

విద్యార్థులు 2,45,584

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని