logo

దేశీదారు.. తగ్గని జోరు

గుడుంబాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పలువురి వ్యాపారుల చూపు పెన్‌గంగ సరిహద్దు మహారాష్ట్రలో చౌక ధరకు లభ్యమయ్యే దేశీదారుపై పడింది. నది పరీవాహక గ్రామాలను అడ్డాగా చేసుకొని జిల్లాలో వ్యాపారులు దేశీదారు

Published : 14 Aug 2022 03:09 IST

మద్యం గొలుసు దుకాణాల్లో విక్రయాలు

జైనథ్‌, న్యూస్‌టుడే

జైనథ్‌ మండలం సాంగ్వి గ్రామంలో సవారి బంగ్లా పక్కన ఓ పాడుబడిన ఇంట్లో నిల్వ చేసిన 39 కార్టన్ల (1,872 సీసాలు) దేశీదారు సీసాలను మూడు నెలల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో దాడులు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.1.17 లక్షలు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుకున్నారంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గుడుంబాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పలువురి వ్యాపారుల చూపు పెన్‌గంగ సరిహద్దు మహారాష్ట్రలో చౌక ధరకు లభ్యమయ్యే దేశీదారుపై పడింది. నది పరీవాహక గ్రామాలను అడ్డాగా చేసుకొని జిల్లాలో వ్యాపారులు దేశీదారు విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాల్లోనే దేశీదారు విచ్చలవిడిగా అమ్ముతున్నారు.

జిల్లాలోని ఆయా గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో గ్రామ జనాభాను బట్టి మద్యం గొలుసు దుకాణాలకు అనధికారికంగా టెండర్లు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు ఈ దుకాణాల్లో దర్జాగా దేశీదారు అమ్మకాలు సైతం సాగిస్తున్నారు. జైనథ్‌ మండలంలోని గిమ్మ, పెండల్‌వాడ, కోర్ట, ఆకోలి, సాంగ్వి, భోరజ్‌, గూడ, సిర్సన్న, రాంపూర్‌, ఆనంద్‌పూర్‌, దీపాయిగూడ, కరంజి, బేల మండలంలోని సాంగిడి, బెదోడ, కొగ్దూర్‌, మాంగ్రూడ్‌, ఆదిలాబాద్‌ మండలం భీంసారి, తాంసి మండలంతో పాటు భీంపూర్‌ మండలంలోని కరంజి(బి), అర్లిటి, పిప్పల్‌కోటి, నిపాని, భీంపూర్‌, వడూర్‌, తలమడుగు మండలం లాల్‌గాడ, ఝరి, రుయ్యాడి తదితర గ్రామాల్లో వ్యాపారం నడిపిస్తున్నారు. గిమ్మ గ్రామంలోనైతే ఇళ్లలోనే వ్యాపారం సాగుతుండటం గమనార్హం.

లాభం ఎక్కువని..

తెలంగాణ మద్యం అమ్మితే లాభాలు అంతంత మాత్రమేనని, మహారాష్ట్రలోని చౌక మద్యం దేశీదారుని అమ్మకాలు సాగిస్తే లాభాలు ఎక్కువ వస్తాయని వ్యాపారులు ఈ దందాను ఎంచుకున్నారు. దేశీదారు ఒక్కో పెట్టె ధర రూ.3600 ఉంటుంది. ఒక్కో పెట్టెలో 48 సీసాలుంటాయి. ఒక్కో సీసా రూ.75 ఉండగా.. రూ.120 లకు విక్రయిస్తారు. ఈ మేరకు ఒక్కో పెట్టెకు రూ.5,760 వస్తాయి. ఖర్చులు పోను ఒక్కో పెట్టెకు రూ.1500 వరకు లాభం చేకూరుతుంది. ఆయా గ్రామాల్లో ఈ లెక్కన జిల్లాలో రోజుకి సుమారు 300 వరకు పెట్టెల చొప్పున అమ్మగా రూ.4.5 లక్షలు, నెలకు రూ.1.35 కోట్లు, ఏడాదికి రూ.16.20 కోట్లకు పై చిలుకు వ్యాపారం సాగుతోంది.

దేశీదారు అమ్మకాలు బాహాటంగా జరుగుతున్నా ఆబ్కారీ అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ముందస్తు సమాచారమిస్తేనే పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే వ్యాపారులు ఇష్టారీతిన అమ్మకాలు సాగిస్తున్నారని, అందుకే దాడులు నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పట్టించుకునే వారేరి?

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున గల పెన్‌గంగ పరీవాహక ప్రాంతం మీదుగా.. నిత్యం జిల్లాలో దేశీదారు దందా యథేచ్ఛగా సాగుతోంది. పట్టించుకునే వారు కరవవడంతో మహారాష్ట్రలోని భోరి, పిప్పల్‌కోఠి,ఫఫ చనాఖా మీదుగా 44వ జాతీయ రహదారి, పెన్‌గంగలో పడవ ద్వారా జైనథ్‌ మండలంలోని నది పరీవాహక గ్రామాలకు, తాంసి మండలంలోని పలు గ్రామాలకు భోరజ్‌ చెక్‌పోస్టు దాటి ఆదిలాబాద్‌కు, మహారాష్ట్రలోని దుర్బ మీదుగా పాటన్‌ గ్రామం ఆపై బేల మండలానికి తరలిస్తున్నారు.

చట్టపరమైన చర్యలు : నరసింహారెడ్డి, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

దేశీదారు విక్రయాలు సాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. దేశీదారు అమ్మకాలు జరిపితే తమకు సమాచారం అందించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని