logo

కూతురికి పైలెట్‌ ఉద్యోగం.. సిబ్బంది విమానంలో తిరుమలకు

కూతురికి విమానం నడిపే పైలెట్‌ ఉద్యోగం రావడంతో   ఆనందంతో ఆ తండ్రి తన దగ్గర పని చేసే 15 మంది సిబ్బందిని విమానం ఎక్కించి తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు.

Updated : 05 Oct 2022 11:14 IST

ఓ కిరాణా దుకాణం యజమాని పెద్ద మనసు


విమానం ఎదుట ఫొటో తీసుకుంటున్న దుకాణ సిబ్బంది

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే : కూతురికి విమానం నడిపే పైలెట్‌ ఉద్యోగం రావడంతో   ఆనందంతో ఆ తండ్రి తన దగ్గర పని చేసే 15 మంది సిబ్బందిని విమానం ఎక్కించి తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం చేయించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన అజీజ్‌ హీరాణి మండల కేంద్రంలో కిరాణా దుకాణం నడిపిస్తున్నారు. కూతురు అఫీనా హీరాణి ఉన్నత చదువులు పైలెట్‌ శిక్షణ పొందారు. పైలెట్‌ శిక్షణలో రాణించడంతో ఇండిగో విమాన సర్వీసులో కొలువు సాధించారు. కూతురు పైలెట్‌ కావడంతో తన కిరాణా దుకాణంలో కూలీలుగా, సిబ్బందిగా పని చేస్తున్న 15 మందిని తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి విమానంలో పంపారు. తన కూతురు ఉన్నతోద్యోగం సాధించడంలో సిబ్బంది, కూలీల శ్రమ సైతం ఉందని అందుకు వారు కోరిన దైవ దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అజీజ్‌ హీరాణి తెలిపారు. స్వామి దర్శనంతో పాటు హైదరాబాద్‌లోని వండర్‌ వరల్డ్‌తో పాటు పలు ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు తెలిపారు. మా జీవితంలో విమానాన్ని దగ్గరగా చూడలేదని.. విమానంలో వెళ్లి స్వామిని దర్శించుకునే భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని సిబ్బంది ఏత్మారావు, అశోక్‌, లక్ష్మణ్‌, ఇందల్‌, జోర్‌సింగ్‌ తెలిపారు. పరమత సహనం చూపిన ఆ యజమానిని పలువురు ప్రశంసిస్తున్నారు. 


కూతురి అఫీనాతో తల్లిదండ్రులు నెవీనా, అజీజ్‌ హీరాణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని