logo

బడుల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్‌..!

ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షించేందుకు జిల్లా అకడమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ పేరిట ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

Published : 27 Nov 2022 03:43 IST

ఉపాధ్యాయుల అసంతృప్తి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షించేందుకు జిల్లా అకడమిక్‌ టాస్క్‌ఫోర్స్‌ పేరిట ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ (తొలిమెట్టు) కార్యక్రమ విజయవంతం, సక్రమ అమలు లక్ష్యంగా కమిటీ పనిచేయనుంది. అదే సమయంలో ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక సహాయం, తోడ్పాటును అందించనుంది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కమిటీ సభ్యులెవరంటే..

జిల్లా విద్యాధికారి, డైట్‌ ప్రిన్సిపల్‌/బోధకుల్లో ఒకరు, జిల్లా నాణ్యత సమన్వయకర్త, మండల విద్యాధికారి, మండలస్థాయి రిసోర్స్‌ పర్సన్‌, క్లస్టర్‌ స్థాయి రిసోర్స్‌ పర్సన్‌, విద్యారంగంలో పనిచేస్తున్న ఏదైనా ఎన్జీఓ ప్రతినిధి ఒకరు.. ఇలా మొత్తం ఏడుగురు ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

విధులిలా..

జిల్లా ప్రణాళికకు అనుగుణంగా నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ బడుల పనితీరును, ప్రగతిని అంచనా వేస్తారు. సామర్థ్యం , ఉపాధ్యాయుల బోధన నైపుణ్యం పెంపొందించడం, అభ్యసనకు అనుగుణంగా సామగ్రిని పంపిణీ చేయడం, పర్యవేక్షించడం వీరి పని. వంద శాతం ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను సాధించేలా అకాడమిక్‌ ప్రణాళికను అభివృద్ధి చేయడం, డైట్‌, ఎంఆర్‌సీ, సీఆర్సీల మధ్య సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు తగిన మద్దతు అందించడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించేలా సలహాలు- సూచనలందించడం, పోషకులు- పాఠశాల కమిటీల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించడం కమిటీ విధుల్లో భాగం.

ఏం చేస్తారంటే..

కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా ఏదో ఒక పాఠశాలను సందర్శించడం, ఎంతమంది ఉపాధ్యాయులున్నారు, ఏ ఉపాధ్యాయుడిని పరిశీలించారు, ఏ విషయం బోధిస్తున్నారు, బోధన ఎలా సాగుతోంది, ఎన్ని తరగతులకు బోధిస్తున్నారు, ఒకటి కన్నా ఎక్కువ తరగతులుంటే ఆ సమయంలో మిగతా విద్యార్థులేం చేస్తున్నారు, ఎలాంటి టీఎల్‌ఎంలు వాడుతున్నారు, ప్రణాళికకు అనుగుణంగా అభ్యసన సాగుతుందా.. తదితర అంశాలను పరిశీలిస్తూ వాటి ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా పరిశీలన పత్రం రూపొందించారు.

ఏర్పాటుపై ఆందోళన..

బోధనను పర్యవేక్షించేందుకు కొత్తగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఇది ఎస్జీటీలపై ఒత్తిడి పెంచే నిర్ణయమని వారు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఉపాధ్యాయులను దోషులుగా చిత్రించే పరిస్థితి కల్పిస్తున్నారని, దానిని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

సమస్యలు పరిష్కరించకుండా పర్యవేక్షణ ఎలా..?

- జుట్టు గజేందర్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. పూర్తిస్థాయిలో బోధకుల్లేరు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్క్‌ఫోర్స్‌ పేరిట ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేయడం సరికాదు. ఇప్పటికే తొలిమెట్టు అమలులో భాగంగా సముదాయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్నతాధికారులు, పాలనాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయడం విడ్డూరం. పాఠశాలలకు రావాల్సిన నిధులు సక్రమంగా రావడం లేదు. ఈ  స్థితిలో టీఎల్‌ఎం (బోధనాభ్యసన సామగ్రి) తయారు చేయాలని ఒత్తిడి పెంచడం దారుణం. కార్యక్రమ ఉద్దేశం మంచిదే అయినా, వనరులను కల్పించి స్నేహపూర్వక వాతావరణంలో అమలయ్యేలా చూడాలి.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు