logo

యువకులుగా వీడి.. వృద్ధాప్యంలో దరిచేరి

పట్టణంలోని శివాజీచౌక్‌లో ఉన్న ఆర్‌.కె.కన్వెన్షన్‌హాలు అది. ఆదివారం ఉదయం నుంచి అక్కడ సందడి వాతావరణం కనిపించింది.

Published : 23 Jan 2023 04:33 IST

ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు

ట్టణంలోని శివాజీచౌక్‌లో ఉన్న ఆర్‌.కె.కన్వెన్షన్‌హాలు అది. ఆదివారం ఉదయం నుంచి అక్కడ సందడి వాతావరణం కనిపించింది. ఏదో ఫంక్షనో, సమావేశమో జరుగుతుండొచ్చని అక్కడున్నవారు భావించారు. ఈలోపు ఒక్కొక్కరుగా వృద్ధాప్యదశలో ఉన్న ఆడామగా వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. వారంతా తమ సంబంధీకులకు తోడుకోసం అక్కడకు రాలేదు. వారితో పాటు కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రులను మరోసారి కలుసుకుందామని. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగే సంఘటనలు ఇప్పుడు పరిపాటిగా మారినా.. ఏకంగా 50 సంవత్సరాల తర్వాత, అంటే కనీసం 65 సంవత్సరాలు వయసున్న వారంతా ఒక్కచోట చేరడం చూసేవారికి కనువిందు చేసింది. ఆసక్తికరమైన ఈ సంఘటనకు నిర్మల్‌ జిల్లాకేంద్రం వేదికైంది.

గోల్డెన్‌ ఎరా పేరిట..

పట్టణంలో 1973- 75 సంవత్సర కాలంలో పదోతరగతి, ఇంటర్‌ సమయంలో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత చదువులు, ఉద్యోగాలంటూ అనువైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. అనంతరం వివాహం, కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు. కాలక్రమేణా కొందరు ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. అందరూ వృద్ధాప్యదశకు చేరుకున్నారు. బాధ్యతల బరువు చాలావరకు దిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను కలుసుకుంటే బాగుంటుందనుకున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సందేశం చేరవేసుకున్నారు. ఆదివారం తమ అ‘పూర్వ’ కలయికకు ఏర్పాట్లు చేశారు. నాడు బోధించిన ఉపాధ్యాయులను మర్చిపోలేదు. అందుబాటులో ఉన్నవారిని పిలిచి సత్కరించారు.

విస్తుపోయి.. జ్ఞాపకాలను తట్టిలేపి..

యవ్వనదశలో విడిపోయిన వారంతా ఇప్పుడు వృద్ధాప్యదశలో ఒకచోట కలుసుకోవడం విశేషం. ఇందులో రాజకీయ, సామాజిక, వ్యాపార, ఉద్యోగ, ఉపాధ్యాయరంగాల్లో ఉన్నవారున్నారు. అందరూ ఒకచోట చేరాక కాసేపు అయోమయంలో పడిపోయారు. చాలామంది ఒకరికొకరు పోల్చుకోలేకపోయారు. తమను తాము పరిచయం చేసుకున్నారు. విద్యార్థులుగా అప్పటి పరిస్థితులు, కాలానుగుణంగా వచ్చిన మార్పులను నెమరేసుకున్నారు. నాటి అందమైన జ్ఞాపకాలను తట్టిలేపారు. తమతో పాటు కలిసి చదువుకొని మృతిచెందినవారిని స్మరిస్తూ నివాళులర్పించారు. అనంతరం అందరూ సామూహిక భోజనాలు చేశారు. మధురానుభూతులను చిరస్మరణీయం చేసుకునేలా ఫొటోలు తీసుకున్నారు.

Read latest Adilabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని