logo

పెట్టింది తిను.. పట్టిక అడగకు!

కొండాకోనల్లో నివసించే ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ఉచితవిద్యతోపాటు పౌష్టికాహారం అందించాల్సిన ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు బడ్జెట్‌ కేటాయింపులు లేక సతమతమవుతున్నాయి.

Published : 02 Feb 2023 02:22 IST

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏడునెలలుగా దుస్థితి
న్యూస్‌టుడే, ఉట్నూరు

గుడ్డు, చికెన్‌ సరఫరా లేకపోవడంతో..  విద్యార్థులకు ఇలాంటి నీళ్ల పప్పే దిక్కు

కొండాకోనల్లో నివసించే ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ఉచితవిద్యతోపాటు పౌష్టికాహారం అందించాల్సిన ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు బడ్జెట్‌ కేటాయింపులు లేక సతమతమవుతున్నాయి. ఆహార పట్టిక(మెనూ) ప్రకారం.. విద్యార్థులకు వారంలో మూడు గుడ్లు, చికెన్‌, కూరగాయలు వడ్డించాల్సి ఉన్నా.. నిధులు లేక కనీసం కూరగాయల భోజనం కరవైంది. పాఠశాలల వార్డెన్లు గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కి బకాయిలు పడ్డారు. అప్పు చేసి సరకులు తెచ్చే పరిస్థితి లేక.. రోజూ నీళ్లలాంటి పప్పు, సాదా అన్నమే పెడుతున్నారు.

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఉట్నూరు ఆధీనంలోని ఉమ్మడి జిల్లాలో 133 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 20 వసతి గృహాలు నడుస్తున్నాయి. వీటిలో 36,813 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి మెరుగైన విద్యతోపాటు నివాస, భోజన వసతిని గిరిజన సంక్షేమ శాఖలు కల్పిస్తున్నాయి. పాఠశాలల్లో అవసరమైన సరకులు, కాస్మెటిక్స్‌ కోసం జీసీసీ టెండర్లను పిలిచి గుత్తేదారుల ద్వారా సరఫరా చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సరకుల కోసం అవసరమైన నిధులను గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వం కేటాయించకపోవడంతో జీసీసీకి బకాయిలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.

నెలల తరబడి ఎదురుచూపులే

గతేడాది జులై నుంచి ప్రభుత్వం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖకు డైట్‌ బడ్జెట్‌ కేటాయించడం లేదు. ఏడు నెలల నుంచి ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు నిత్యావసర సరకులు, కాస్మెటిక్స్‌ సరఫరా చేస్తున్న జీసీసీకి వార్డెన్లు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసర సరకుల టెండర్లను దక్కించుకున్న గుత్తేదారులు అప్పొసప్పు చేసి కొన్ని నెలలు సరకులు సరఫరా చేశారు. నెలల తరబడి బిల్లులు రాక సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నారు. మరోవైపు ఏడు నెలల్లో ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాల వార్డెన్లు రూ.12.11 కోట్లు జీసీసీకి బకాయి పడ్డారు.

* నిధులు లేమితో ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో నెలకొన్న నిత్యావసర సరకుల సమస్యపై ‘న్యూస్‌టుడే’ ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్‌ను వివరణ కోరగా.. బడ్జెట్‌ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధులు మంజూరు కాగానే సమస్యను పరిష్కరిస్తామన్నారు.


నిత్యావసర సరకులు, సబ్బులు, ఇతర సామగ్రి లేక వెలవెలబోతున్న ఈ నిల్వ గది ఉట్నూరు మండలం లక్షిటిపేట గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోనిది. ఇక్కడ 320 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి ప్రతి రోజు పౌష్టికాహారం అందించేందుకు జీసీసీ నుంచి అవసరమైన సరకులు సరఫరా చేయాల్సి ఉన్నా.. నిధులు లేక సరఫరా నిలిచిపోయింది. ఈ ఒక్క ఆశ్రమ పాఠశాల జీసీసీకి రూ.10 లక్షలపైనా బాకీ పడింది. ఇదొక ఉదాహరణ మాత్రమే. నిధులు లేమితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని