logo

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు

ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించి కార్పొరేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనఊరు- మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని తాజాగా బదిలీ అయిన పాలనాధికారి రాహుల్‌రాజ్‌ తెలిపారు.

Published : 02 Feb 2023 02:22 IST

తేలిగూడ పాఠశాలలో డ్యూయల్‌ డెస్కులపై విద్యార్థులతో కలిసి కూర్చున్న పాలనాధికారి

రాహుల్‌రాజ్‌, అదనపు పాలనాధికారి చాహత్‌ బాజ్‌పాయి, ఎమ్మెల్యే సక్కు తదితరులు

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించి కార్పొరేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనఊరు- మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని తాజాగా బదిలీ అయిన పాలనాధికారి రాహుల్‌రాజ్‌ తెలిపారు. ఆకర్షణీయమైన వాతావరణం, సౌకర్యవంతమైన మౌలిక వసతులతో విద్యార్థులు ఉత్తమ విద్యను అందుకుంటారన్నారు. మనఊరు- మనబడి మొదటి విడత కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్దిన ఆసిఫాబాద్‌ మండలంలోని తేలిగూడ మండల పరిషత్‌ ప్రాథమికోన్నత ఆదర్శ పాఠశాలను బుధవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదపు పాలనాధికారులు చాహత్‌ బాజ్‌పాయి, రాజేశంలతో కలిసి ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, డ్యూయల్‌ డెస్కులు, సామగ్రి, ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి వసతి, వంటశాల, భోజనశాల, అదనపు గదులు, ప్రహరీలను పరిశీలించిన ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ.. రూ.32 లక్షలతో ఈ పాఠశాలలో సకల వసతులు కల్పించామన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం మొదటి విడత కింద 251 పాఠశాలలను ఎంపిక చేసిన పనులు చేపట్టినట్లు వివరించారు.

* ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసమే ప్రభుత్వం మనఊరు- మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అన్ని వసతులతో కూడిన తేలిగూడ పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉండటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌, జడ్పీటీసీ సభ్యులు అరిగెల నాగేశ్వర్‌రావు, డీఈవో పార్శి అశోక్‌, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, స్థానిక సర్పంచి, అధికారులు, భారాస నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని