logo

నాణ్యమైన విద్య పిల్లల బంగారు భవితకు బాట : మంత్రి ఐకేరెడ్డి

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే రాష్ట్రం ముందువరుసలో ఉందని, అన్ని రంగాల అభ్యున్నతికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

Updated : 02 Feb 2023 05:34 IST

డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలపై కూర్చున్న మంత్రి ఐకేరెడ్డి,

జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ

నిర్మల్‌, న్యూస్‌టుడే : తెలంగాణ ఆవిర్భావం తర్వాత మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే రాష్ట్రం ముందువరుసలో ఉందని, అన్ని రంగాల అభ్యున్నతికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్‌ గ్రామీణ మండలం ఎల్లపల్లిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య, పిల్లల భవితకు బంగారు బాటలు వేయాలన్న లక్ష్యంతో సీఎం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. విద్యారంగం బలోపేతం చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, సర్కారు బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేలా 12 రకాల పనులు చేపట్టి ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సౌకర్యాలు కల్పించడంతో పిల్లలతో పాటు, ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో బోధించే అవకాశం కలిగిందన్నారు. జిల్లాలో మొదటి విడతలో రూ.82 కోట్లతో 260 బడులు ఆధునికీకరిస్తున్నామని, మూడు దశల్లో అన్ని చోట్లా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ, మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేందర్‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రమణ, పారిశ్రామికవేత్త మురళీధర్‌రెడ్డి, డీఈఓ రవీందర్‌రెడ్డి, సర్పంచి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి

నిర్మల్‌ : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గాజులపేట్‌లో రూ.2 కోట్లతో నిర్మించనున్న షాదీఖానాకు భూమి పూజ చేసి మాట్లాడారు. రంజాన్‌, బక్రీద్‌ సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఈద్గా నిర్మిస్తున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని